మరి కొన్ని గంటల్లో.. 2022 ముగియనుంది. కొత్త ఏడాది 2023కు సరికొత్తగా స్వాగతం పలకనున్నాం. ఏడాది కాలం అంటే 365 రోజులు. ప్రతి రోజు ఆసక్తికరంగా సాగకపోవచ్చు. కానీ అప్పుడప్పుడు చోటు చేసుకున్న సంఘటనలు.. ఆ ఏడాది మొత్తం.. కొన్నైతే.. ఏళ్ల పాటు ప్రభావం చూపుతాయి. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చోటు చేసుకునే సంఘటనలు.. ఆ రాష్ట్ర రాజకీయ భవిషత్తుపై ప్రభావం చూపుతాయి. మరి 2022లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణమామలు ఏంటి.. ఎవరు బలం పుంజుకున్నారు.. ఎవరు వెనకబడ్డారు.. వంటి వివరాలను మరోసారి చూద్దాం.
ఎన్నికలతో పని లేకుండా ఏపీ రాజకీయాలు ఎప్పుడు హాట్‌హాట్‌గానే ఉంటాయి. అధికార-విపక్షాల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ప్రతి రోజు ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో ఎన్నికల సమయం దగ్గర పడ్డప్పుడు పొలిటికల్ హీట్ పెరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం అలా కాదు. ఏడాదంతా రాజకీయ రగడ కొనసాగుతుంది. రాజకీయాలపరంగా హైపర్ యాక్టీవ్‌గా ఉండే ఏపీలో ఈ ఏడాది చోటు చేసుకున్న కీలక పరిణామాలు ఇలా ఉన్నాయి.
అధికార పార్టీకి సంబంధించి చూస్తే.. ఈ ఏడాది వైసీపీ ముఖ్య నేత.. మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి చెందారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటనే చెప్పవచ్చు. గౌతంరెడ్డి మృతి నేపథ్యంలో.. ఆత్మకూరులో ఉప ఎన్నిక జరిగింది. దీనిలో వైసీపీ అభ్యర్థి.. విజయం సాధించారు. ఆ తర్వాత సీఎం జగన్.. మంత్రులందరిని రాజీనామా చేయించి.. కొత్త కేబినెట్ ఏర్పాటు చేశారు. పాతవారు 11 మందికి కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించడం తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
అధికార పార్టీకి సంబంధించి మరో కీలక పరిణామం ఏంటంటే.. విజయమ్మ.. వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేయడం.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. షర్మిలకు అండగా ఉండేందుకే.. తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ ప్రకటించింది. కారణాలు ఏమైనా కానీ.. ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అలానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు కూడా సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గత ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన టీడీపీ.. మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లోపించడంతో.. పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు చేసే ప్రయత్నాలన్ని వృధా అవుతున్నాయి. మరీ ముఖ్యంగా చాలా మంది కీలక నేతలు.. ఎన్నికల తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. అధినేత నుంచి పిలుపు వచ్చినా పట్టించుకునే స్థితిలో లేరు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం కోసం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. జిల్లాల్లో పర్యటిస్తూ.. పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అలానే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు రెడీగా ఉన్నాడు. కానీ దీనిపై జనసేనాని ఇంత వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో పవన్ విశాఖ పర్యటన సందర్భంగా.. పోలీసులు ఆయనన్ను అడ్డుకున్నారు. దాంతో పవన్‌కు సంఘీభావం తెలిపేందుకు.. చంద్రబాబు.. వెళ్లడం సంచలనంగా మారింది. ఈ మీటింగ్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక వచ్చే ఏడాది నుంచి నారా లోకేష్ యువ గళం పేరుతో.. పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించారు. మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయో రానున్న రోజుల్లో చూడాలి.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మిగతా ప్రతిపక్ష పార్టీలతో పోలిస్తే.. జనసేన దూకుడుగా వ్యవహరించింది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వారి తరఫున పోరాటం చేయడంలో జనసేన మిగతా పార్టీలకన్నా.. ఓ అడుగు ముందే ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. తన పార్టీ తరఫున ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్నాడు జనసేనాని. ఏపీ రాజకీయాల్లో అంత్యత సంచలనం సృష్టించిన మరో సంఘటన.. మోదీ-పవన్ భేటీ. విశాఖ వచ్చిన మోదీ.. పవన్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించి.. ఆయనతో భేటీ కావడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. అలానే పవన్ విశాఖపట్నం టూర్‌ని పోలీసులు అడ్డుకున్న సందర్భంలో.. చంద్రబాబు.. స్వయంగా వెళ్లి ఆయనను కలవడం కూడా రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
అన్నింటికి మించి.. పవన్ తన రాజకీయ వ్యూహాల గురించి పూర్తి స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. ప్రజలు అంగీకరిస్తే.. తాను సీఎం అవుతానని స్పష్టం చేశాడు. వైసీపీని ఓడించే బాధ్యత తనదే అని చెప్పిన పవన్.. తనపై వ్యక్తిగత విమర్శలు చేసే నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలానే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం కోసం పవన్ ప్రత్యేకంగా వారాహి వాహానాన్ని సిద్ధం చేయించారు. దీనిపై కూడా రాజకీయ వర్గాల్లో చాల పెద్ద చర్చే జరిగింది. ఎన్నికల వరకు పవన్ తన దూకుడు ఇలానే కొనసాగించాలని పార్టీ కార్యకర్తలు, జనసేన నేతలు కోరుకుంటున్నారు.
గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా వేదికగా.. అనేక కీలక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక 2001లో ఉద్యమ పార్టీగా తెరపైకి వచ్చి.. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత రాజకీయ పార్టీగా అవతరించింది టీఆర్‌ఎస్. ఎనిమిదేళ్ల తర్వాత.. 2022లో టీఆర్‌ఎస్ నూతన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా.. కేసీఆర్.. టీఆర్‌ఎస్‌ని.. భారతీయ రాష్ట్ర సమితిగా మార్చి.. దేశ రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక తెలంగాణ రాజకీయాల్లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మునుగోడు ఉప ఎన్నిక. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరాడు. దాంతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిన ఈ పోటీలో.. రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. ఇక ఎమ్మెల్యేలకు ఎర కేసు కూడా రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. అలానే జూనియర్-అమిత్ షా భేటీ కూడా రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకు.. పాదయాత్ర చేస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం.. టీఆర్‌ఎస్ కార్యకర్తలు.. షర్మిల పాదయాత్రను అడ్డుకోవడమే కాక.. ఆమె వాహనంపై దాడి చేశారు. ఈ పంఘటన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇక వచ్చే ఎన్నికల్లో.. షర్మిల.. పాలేరు నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
ఇక చంద్రబాబు నాయుడు కూడా తెలంగాణాలో కూడా తన సత్తా చాటాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితం చంద్రబాబు నాయుడు.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాడు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయడం తెలంగాణలో సంచలనంగా మారింది. ఈ సందర్భంగా చంద్రబాబు.. పార్టీని వీడి వెళ్లిన నేతలు తిరిగి రావాలని కోరారు.