స్పోర్స్ట్ డెస్క్- టీం ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ స్థానంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉండేందుకు భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ విముఖత చూపారు. అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుండగా, ఈ మెగా టోర్నీతో భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది.
ఈ నేపధ్యంలో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ ఎంపిక లాంఛనమే అనిపిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్, టీం ఇండియా కోచ్ గా రాబోతుండటంతో, ఎన్‌సీఏని నడిపించాల్సిందిగా వీవీఎస్ లక్ష్మణ్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. ఐతే వీవీఎస్ లక్ష్మణ్ మాత్రం ఆ ప్రతిపాదనని తిరస్కరించినట్లు సమాచారం.
ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి మెంటార్ గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్, బెంగాల్ క్రికెట్ జట్టుకి బ్యాటింగ్ సలహాదారుగా కూడా ఉన్నారు. అంతే కాకుండా ఇంటర్నేషనల్ మ్యాచ్ లకి కామెంటేటర్ గానూ వ్యవహరిస్తున్నాడు వీవీఎస్ లక్ష్మణ్. నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా బాధ్యతలు చేపడితే, వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం నిర్వర్తిస్తున్న మూడు బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంటుందట.
ఇకపై పూర్తి స్థాయిలో ఎన్‌సీఏకే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అందుకే వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐ ఆఫర్ ను తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఐతే బీసీసీఐ ప్రతిపాదనపై వీవీఎస్ లక్ష్మణ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. బీసీసీఐ కూడా దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు.