స్పోర్స్ట్ డెస్క్- టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా ఓటమి తరువాత భారత పేసర్ మహ్మద్ షమీపై పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షమీ పాకిస్థాన్ కు ఎక్కువగా పరుగులు ఇవ్వడం వల్లే భారత్ ఓడిపోయిందని భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. సోషల్ మీడియాలో షమీపై ట్రోలింగ్ ను టీం ఇండియా క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు సహా పలువురు తీవ్రంగా ఖండించారు.
విరాట్ కోహ్లీ కూడా షమీపై సోషల్ మీడియాలో దాడిని ఖండించి అతడికి అండగా నిలబడ్డాడు. షమీకి తామంతా ఎప్పుడూ అండగా ఉంటామని కోహ్లీ చెప్పాడు. మతం పేరుతో షమీని దూషించడం నీచమైన పని అని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా తమ సోదరభావాన్ని చెడగొట్టలేరని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు.
ఇదిగో షమీకి విరాట్ కోహ్లీ అండగా నిలబడటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కొందరు ఈసారి ఏకంగా కోహ్లీ, అనుష్కశర్మల కూతురు వామికను టార్గెట్‌గా చేస్తున్నారు. 10 నెలల చిన్నారిపై అత్యాచారం తప్పదంటూ గుర్తు తెలియని దుండగులు హెచ్చరించారు. @Criccrazyygirl అనే ట్విట్టర్ ఖాతా నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు గుర్తించారు. ఐతే కాసేపటికే ట్వీట్‌ను డిలీట్ చేశారు. కోహ్లీ కూతురుపై వచ్చిన ఈ బెదిరింపు ట్వీట్ పై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు.
కోహ్లీని, అతడి ఫ్యామిలీనీ టార్గెట్ చేస్తుండడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కోహ్లీ కుమార్తెకు వచ్చిన బెదిరింపులు తన దృష్టికీ వచ్చాయని ఇంజమాముల్ హక్ చెప్పారు. ఇది ఒక గేమ్ మాత్రమేనన్న విషయాన్ని ప్రజలు ముందు అర్థం చేసుకోవాలని అన్నాడు. తామందరం వేర్వేరు దేశాల తరపున ఆడుతున్నా, అందరం ఒకటేనని చెప్పాడు.
కోహ్లీ బ్యాటింగ్‌ను, అతడి కెప్టెన్సీని విమర్శించే హక్కు ఉంటుందని, కానీ అతడి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకునే హక్కు ఎవరికీ లేదని ఇంజమాముల్ హక్ వ్యాఖ్యానించాడు. కొందరు కోహ్లీ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకోవడం తనను తీవ్రంగా బాధించిందని ఇంజిమామ్ తన యూట్యూబ్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే ఈ విషయంపై కోహ్లీ గాని, అనుష్క శర్మ గాని ఇంతవరకు స్పందించలేదు.