బెంగళూరు- కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతితో కన్నడ నాట విషాదం అలముకుంది. ఒక్క శాండల్ వుడ్ లో మాత్రమే కాదు, టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పునీత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివ దేహానికి నివాళి అర్పించేందుకు సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు బారులు తీరారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం కన్నీటి సంద్రమైంది. శాండల్ వుడ్ ప్రముఖుల నుంచి మొదలు అన్ని బాషల సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియానికి వచ్చి పునీత్ రాజ్ కుమార్ కు నివాళి అర్పించారు.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, ఎస్.ఎం.కృష్ణ, సదానందగౌడ, కర్ణాటక గవర్నరు థావర్ చంద్ గహ్లోత్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తదితరులు పునీత్ రాజ్ కుమార్ పార్ధీవదేహానికి నివాళులు అర్పించారు. పునీత్ మరణంపై కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ రాజ్ కుమార్ ఆఖరిసారి తనతో మాట్లాడిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు.
పునీత్ రాజ్‌కుమార్ చనిపోవడానికి ముందు రోజు గురువారం కర్ణాటక టూరిజానికి సంబంధించిన ఓ వెబ్ సైట్ ను ఆవిష్కరించాలని తనను కోరారని చెప్పారు. నవంబర్ 1న దానికి సంబంధించిన యాప్ ని విడుదల చేయనున్నానని పునీత్ రాజ్ కుమార్ చెప్పారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ మన మధ్య లేకపోవడం దురదృష్ణకరమని సీఎం బొమ్మై అన్నారు.
కర్ణాటక రాష్ట్రం, కన్నడ చిత్రసీమ, యువత పునీత్ ను ఎంతగానో మిస్ అవుతున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేవారని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై అన్నారు. పునీత్ రాజ్ కుమార్ లేని లోటు ఎవ్వరు పూడ్చలేరని, ఆయనకు ఎరు సాాటి రారని వ్యాఖ్యానించారు.