కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నేతలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను పార్టీలు విడుదల చేస్తున్నాయి. ఈ సమయంలో బీజెపీ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవ రాజు బొమ్మైకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. 224 స్థానాలకు మే 10న ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్లీ అధికారం తమదేనని బీజెపీ భావిస్తుండగా..కాంగ్రెస్ తమకే విజయం దక్కుతుందన్న ఆశలతో ఉంది. మాజీ ప్రధాని దేవేగౌడ పార్టీ నేతృత్వంలోని పార్టీకి జనతాదళ్ సెక్యులర్‌కు కూడా ఈ ఎన్నికలు కీలకం. అయితే ఈ పార్టీ.. ఎన్నికల ఫలితాల సమయంలో కింగ్ మేకర్ గా మారే అవకాశాలు చాలా కనిపిస్తాయి. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాతో పాటు ప్రచారాన్నిషురూ చేస్తున్నారు బీజెపీ నేత, రాష్ట్రముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై. ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్న ముఖ్యమంత్రికి ఓ పర్యటన సమయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై ప్రయాణిస్తున్న విమానంలో మంటలు చెలరేగాయి. ఉడిపి జిల్లా కొల్లూరులో ఉన్న మూకాంబికా గుడి దర్శనానికి సీఎం బసవరాజు బొమ్మై తన భార్యతో కలిసి వెళ్లారు. అయితే ఆరేశిరూరు హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ముఖ్యమంత్రి కాన్వాయ్ హెలిఫ్యాడ్ నుండి ఆలయానికి బయలు దేరిన కొద్ది సేపటికి హెలికాఫ్టర్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హెలికాఫ్టర్ ఫ్యాన్ నుండి ఈ మంటలు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేయడంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. కాగా, మూకాంబికా అమ్మవారిని దర్శించుకుని సీఎం బొమ్మై, ఆయన సతీమణి పూజలు చేశారు.