హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తాం. దాన్ని సర్వ్ చేసినందుకు ఛార్జ్ వేయడం ఏంటి? ఇప్పుడు చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ ఆర్డర్ చేస్తే సర్వీస్ ఛార్జ్ వేస్తున్నారా? మరి రెస్టారెంట్స్ లో సర్వీస్ ఛార్జ్ ఎందుకు అడుగుతున్నారు? ఈ సర్వీస్ ఛార్జ్ చెల్లించాలా? అయినా సర్వీస్ చేసినందుకే కదా వెయిటర్స్ కి టిప్ ఇస్తున్నాం. మరి సర్వీస్ ఛార్జ్ ఎందుకు? అసలు సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? వినియోగదారుల ఫారం ఏం చెబుతోంది?
హోటల్స్, రెస్టారెంట్స్, బార్లకు వెళ్ళినప్పుడు అక్కడ తిన్నందుకు, తాగినందుకే కాకుండా అదనంగా సర్వీస్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తుంటారు. అయితే ఈ సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా ఇవ్వాలా? రెస్టారెంట్ లో ఏదైనా ఆర్డర్ చేస్తే దాన్ని సర్వీస్ చేసినందుకు అదనంగా ఛార్జ్ చేస్తారు. అంటే రెస్టారెంట్ సిబ్బంది సర్వ్ చేసినందుకు సర్వీస్ ఛార్జ్ ఆల్రెడీ ఇస్తున్నప్పుడు టిప్ ఎందుకు ఇవ్వడం? కానీ చాలా మంది సర్వీస్ ఛార్జ్ వేరే, టిప్ వేరే అనుకుని మళ్ళీ టిప్ ఇస్తున్నారు. సర్లే ఈ రెస్టారెంట్ వాళ్ళు సర్వీస్ ఛార్జ్ నొక్కేసి.. సిబ్బందికి ఇవ్వరు అని జాలి పడి టిప్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సరే టిప్ ఇస్తున్నప్పుడు ఇక సర్వీస్ ఛార్జ్ ఎందుకు ఇవ్వడం అని అనిపిస్తుంది కదా. మరి సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? అంటే అవసరం లేదు.
రెస్టారెంట్లు, బార్లు, హోటల్స్ లో ఆర్డర్ చేసిన ఫుడ్ కి అయిన బిల్ మాత్రం చెల్లిస్తే చాలు. సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత వారం నోయిడాలోని ప్రముఖ స్పెక్ట్రమ్ మాల్ లో ఓ రెస్టారెంట్ కి వెళ్ళింది ఓ కుటుంబం. తిన్న తర్వాత బిల్ చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే సర్వీస్ ఛార్జ్ రూ. 970 ఉంది. ఇదెక్కడి అన్యాయం, మేం కట్టం అని కుటుంబ సభ్యులు అంటే వారి మీద రెస్టారెంట్ వాళ్ళు గొడవకు దిగారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు కలబడి కొట్టుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసుల వరకూ వెళ్ళింది. అయితే ఈ ఘటనతో సర్వీస్ ఛార్జ్ ఖచ్చితంగా చెల్లించాలా? అనే దాని మీద చాలా మందికి సందేహం తలెత్తింది.
ఉత్తరప్రదేశ్ లోని రెస్టారెంట్ లో జరిగిన హింసాత్మక ఘటనను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలోని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రెస్టారెంట్, బార్లలో సర్వీస్ ఛార్జ్ చెల్లింపునకు సంబంధించి తాజా నోటిఫికేషన్ లో స్పష్టత ఇచ్చింది. రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు సర్వీస్ చార్జీలు చెల్లించాలని వినియోగదారులను బలవంతం చేయకూడదని.. ఎందుకంటే ఇది విచక్షణా ఛార్జ్ అవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. కస్టమర్ తన విచక్షణ మేరకు సర్వీస్ తో సంతృప్తి చెందితే ఛార్జ్ చెల్లిస్తారని.. సర్వీస్ నచ్చకపోతే సర్వీస్ ఛార్జ్ పే చేయమని బలవంతం చేయకూడదని స్పష్టం చేసింది. అంటే రెస్టారెంట్, హోటల్స్ కి వెళ్ళినప్పుడు సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదు.