మనదేశంలో కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
మనదేశం హిందూ దేవాలయాలకు నిలయం. ఇక్కడ అనేక దేవాలయాలు నెలకొన్నాయి. వీటిలో చాలా ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి దేవాలయాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు సంతానం కలుగడానికి ప్రత్యేకంగా నాగదేవతకు పూజలు చేసి, జంటనాగులకు నీటితో అభిషేకం చేస్తారు. ఆరోగ్య సమస్యలకు, ధనప్రాప్తికి, విద్య, ఉద్యోగాలకు, జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలన్నా, వీసాలు పొందాలన్నా, సొంత ఇల్లు నిర్మాణం కొరకు ఇలా చాలా కోరికలు తీర్చుకునేందుకు గుళ్లలోకి వెళుతుంటారు. దేవాలయాలను దర్శించుకుని, పూజలు, హోమాలు చేసి కోరికలను నెరవేర్చుకుంటారు. కొన్ని దేవాలయాలు అద్భుతాలకు నిలయాలు. అలాగే ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉన్న బన్షీ నారాయణ్ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గుడి కేవలం రక్షా బంధన్ పండుగ రోజున మాత్రమే తెరుచుకుంటుంది. ఈ బన్షీ నారాయణ్ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటో, ప్రత్యేకతలేంటో మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని ఉర్గామ్ వ్యాలీకి సమీపంలో బన్షీ నారాయణ్ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. దీనిని వంశీనారాయణ దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ గుడిలో విష్ణువు, శివునితో పాటుగా గణేశుని విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ గుడికి ట్రెక్కింగ్ చేస్తూ భక్తులు చేరుకుంటారు. దాదాపు 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన దేవాలయం. ఇది చాలా ఎత్తైన ప్రదేశంలో నిర్మితమైంది. ఈ అందమైన దేవాలయం 3600 మీటర్ల ఎత్తులో ఉంది. శ్రీ కృష్ణుడు ఇప్పటికీ దిగి వస్తాడని భక్తులు నమ్ముతుంటారు. అప్పుడప్పుడు వేణువు శబ్దం కూడా వినబడుతుందని విశ్వసిస్తారు.
ఈ దేవాలయం తలుపులు రక్షా బంధన్ రోజున మాత్రమే తెలుస్తారు. ఏడాదిలో ఆ ఒక్కరోజు మాత్రమే స్థానికులు ప్రత్యేక పూజలు చేస్తారు. రాఖీ పండుగ రోజున సోదరీమణులు వారి సోదరులకు రాఖీ కట్టే ముందు ఇక్కడి దేవాలయాన్ని సందర్శించుకుంటారు. ఈ ఆలయానికి స్థల పురాణ విషయానికి వస్తే విష్ణువు తన వామన అవతారం నుండి విముక్తి పొందిన తర్వాత ఇక్కడే మొదటిసారి దర్శనమిచ్చాడని చెబుతుంటారు. ఈ గుడికి దగ్గరగా ఓ గుహ కూడా ఉంది. అక్కడ భక్తులు కానుకలు సమర్పిస్తారు. రాఖీ పండుగ రోజున స్థానికులు ప్రసాదంలో వెన్న కలిపి దేవునికి నైవేద్యంగా నివేదిస్తారు.