టెక్నాలజీ డెస్క్- ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ రోజుకో మార్పు చేస్తోంది. మొన్నానే మాతృసంస్థ పేరును మార్చిన ఫేస్‌బుక్, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫేస్ బుక్ లో ఫేషియల్ రికగ్నిషన్ ను ఆప్షన్ ను తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతే కాదు ఫేస్ ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా స్పష్టం చేసింది. ఫేస్ బుక్ లోని ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలో ఇది పెద్ద మార్పు అని మెటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైస్ ప్రెసిడెంట్ జెరోమ్ పెసెంటి చెప్పారు.
ఫేస్ బుక్ 2010లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ఫేస్ బుక్ వినియోగిస్తున్న వారిలో మూడొంతుల మంది ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఫేస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయంతో సుమారు వంద కోట్ల కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారని సంస్థ చెబుతోంది. ప్రధానంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్ ఆల్ట్ టెక్ట్స్ పై దీని ప్రభావం ఉండనుంది.
ఫెస్ బుక్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై ఫొటోల్లోని వ్యక్తి సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్ చేయడానికి అస్సలు కుదరదు. అంతే కాదు ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా వీలుపడదు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫేస్ బుక్ లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్న నేపధ్యంలో, దీనికి సంబంధించి వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో పలు సంస్థలు ఉన్నట్లు ఫెస్ బుక్ తెలిపింది.
వినియోగదారుల భద్రతకు సంబందించి విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి తగ్గించేలా ఫేస్ బుక్ లో ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తొలగించనున్నామని సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఫేస్ బుక్ లో దీన్ని ఉపయోగిస్తున్నవారు ఇక భవిష్యత్ లో ఈ టెక్నాలజీని ఉపయోగించలేరని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ కోసం ఉపయోగించే టెంప్లేట్ లను పూర్తిగా తొలగిస్తున్నట్లు జెరోమ్ సెపెంటి తన బ్లాగ్ లో స్పష్టం చేశారు. రోజురోజుకు సామాజిక ఆందోళనలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్ చేసేందుకు ఈ సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.