శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే ‘యస్’ తుపాను క్రమంగా తీవ్రమై మంగళవారం సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా మారింది. దీంతో ఒడిశా, బెంగాల్ తీర ప్రాంతాలకు ‘‘రెడ్ అలర్ట్’’ జారీ అయింది. రాత్రి 8.30 గంటలకు ఐఎండీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఇది ఒడిశాలోని పారాదీప్‌కి 160 కి.మీ. దూరంలో, ఆ రాష్ట్రంలోని బాలాసోర్‌కి 250 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు 240 కి.మీ., సాగర్ ద్వీపానికి 230 కి.మీ.దూరంలో ఉంది. గంటకు 15 కి.మీ వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతోంది. యస్‌తుపాను ధామ్రా పోర్టుకు ఉత్తరంగా, బాలాసోర్‌కు దక్షిణంగా ఉన్న ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నానికి తీరం దాటుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సమయంలో గంటకు 185 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగరేశారు.
ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంతాల్లో గాలుల ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం ఉదయం కూడా తుపాను ప్రభావం ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి, అలాగే మధ్య బంగాళాఖాతంలో సముద్రం అసాధారణ రీతిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు జిల్లాలపై తుపాను ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ముంద]ు జాగ్రత్త చర్యగా పశ్చిమ బెంగాల్‌లోని తీర ప్రాంతాల నుంచి 9 లక్షల మందిని, ఒడిశా నుంచి 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్‌లో 74 వేల మంది సిబ్బందిని, 2 లక్షల మందిని రంగంలో దించారు.