APలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయన వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వానలు దంచికొడుతున్నాయి. ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనితో ఈరోజు నుండి మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నాయని భావిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కర్నూలు, నంద్యాల, పల్నాడు, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలతోపాటు పిడుగులు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
బాపట్ల, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద ఉండరాదన్నారు.
మంగళవారం రాత్రి 7 గంటల నాటికి అనకాపల్లి జిల్లా గొలుగొండలో 99.75 మి.మీ, విజయనగరం జిల్లా పెదనాడిపల్సె 77 మి.మీ విశాఖపట్నం రూరల్ లో 73.25 మి.మీ, అల్లూరి సీతారామరాజు జిల్లా మూలపేటలో 70 మి.మీ విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడలో 67.75 మి.మీ, కృష్ణా జిల్లా పెడనలో 59.25 మి.మీ అధిక వర్షపాతం, 60 మి.మీ కన్న ఎక్కుల వర్షపాతం ఈ 5 ప్రాంతాల్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరి వరద మరింత పెరగనున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 7 గంటలకు గోదావరి వరద ప్రవాహం భద్రాచలం వద్ద 39 అడుగులు, ధవలేశ్వరం బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, బెట్ ఫ్లో 6.76 లక్షల క్యూసెక్కులు ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా. బీఆర్ అంబేద్కర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర సహాయక చర్యల కోసం 6 బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.