చప్రా జిల్లాలోని బహ్రాంపూర్ ఇమాంబరా సమీపంలోని ఉర్దూ పాఠశాలలో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. దీంతో, అజార్ హుస్పేన్ అనే వ్యక్తి కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లాడు. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో అక్కడున్న నర్సులు త్వరగా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చందా కుమారి అనే నర్సు హుస్సేన్ అనే వ్యక్తికి సిరంజిలో వ్యాక్సిన్ లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చింది. హుస్సేన్ వ్యాక్సిన్ తీసుకుంటుండగా పక్కనే ఉన్న అతని స్నేహితుడు వీడియో తీశాడు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నానని భావించిన హుస్సేన్ ఇంటికి వెళ్లి తన స్నేహితుడు తీసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అక్కడే ఓ విచిత్రం బయటపడింది.
హుస్సేన్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చే ముందు సదరు మహిళా నర్సు బిజీగా మాట్లాడుతుండటాన్ని గమనించారు నెటిజన్లు. ఆమె ఒక రేపర్ నుంచి సిరంజిని తీసివేసి, దానిలో వ్యాక్సిన్ నింపకుండానే హుస్సేన్ ఎడమచేతి భుజానికి ఇచ్చింది. నిజంగానే హుస్సేన్ తీసుకున్నానని భావించిన హుస్సేన్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరాడు. ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు అసలు విషయం చెప్పారు. దీంతో, సదరు నర్సు ఖాళీ సిరంజితో ఇంజెక్ట్ చేసిందని హుస్సేన్ గుర్తించాడు.
ఖాళీ సిరంజీతోనే ఇంజెక్షన్ ఇచ్చినట్లు చాలా స్పష్టంగా కనిపించింది. వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి అధికారులకు సమాచారం అందించాడు. ఇంజెక్షన్ చేసిన నర్సును విధుల నుంచి తొలగించారు అధికారులు. కేంద్రంలో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పొరపాటు జరిగిందని తెలిపారు. బాధితుడు తనకు వీలైన రోజు మరోసారి వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. తనకు తీవ్ర తలనొప్పి మొదలైందంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు ఆ యువకుడు.