అన్‌స్టాపబుల్ షోలో నర్సుల గురించి నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం అయ్యింది. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ నర్సుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై బాలకృష్ణ స్పందించారు. నర్పులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. నర్సులంటే తనకు ఎంతో గౌరవం అని తెలిపారు. కానీ కొందరు తాను నర్సులను అగౌరవపరిచానంటూ.. అసత్య ప్రచారం చేస్తున్నారని.. తన మాటలను కావాలనే వక్రీకరించారని తెలిపారు. ఈ మేరకు బాలకృష్ణ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ.. ‘‘అందరికి నమస్కారం.. నేను నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొందరు నా మాటలను కావాలనే వక్రీకరించారు. రోగులకు సేవలందించే నర్స్ సోదరీమణులంటే నాకెంతో గౌరవం, మర్యాద. మా బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను నేను ప్రత్యక్షంగా చూశాను. రాత్రింబవళ్లు.. రోగులకు సపర్యలు చేసి.. వారి ప్రాణాలు కాపాడే నర్స్ సోదరీమణులంటే నాకెంతో గౌరవం’’ అని తెలిపారు.
‘‘ఎంతో ఓపికగా.. రోగులకు ఎంతో సేవ చేసే నర్సులకు ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తక్కువే అని నేను భావిస్తాను. ఇక కరోనా వేళ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ.. పగలనక, రాత్రనక, నిద్రాహారాలు మానేసి.. ఎందరో కరోనా రోగులకు సేవలందించారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు మీ మనోభావాలను దెబ్బతీస్తే.. అందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను..-మీ నందమూరి బాలకృష్ణ’’ అంటూ బాలయ్య ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వచ్చిన అన్‌స్టాపబుల్ సీజన్-2 పార్ట్ 1 ఎపిసోడ్‌లో బాలయ్య మాట్లాడుతూ.. గతంలో తనకు జరిగిన ఓ ప్రమాదం గురించి వెల్లడించాడు. ‘‘అయితే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పుకోవడం ఇష్టం లేక.. కాలు జారి కిందపడ్డాను అని చెప్పాను. కానీ తనను పరీక్షించడానికి వచ్చిన నర్స్ అందం చూసి నిజం చెప్పాను’’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణం అయ్యాయి. మరి బాలయ్య వివరణతో ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.