స్పోర్స్ట్ డెస్క్- బీసీసీఐకి కాసుల వర్షం కురిసింది. రెండు కొత్త ఫ్రాంచైజీల ద్వార ఏకంగా 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. అహ్మదాబాద్, లక్నో కేంద్రాలుగా రెండు కొత్త జట్లు చేరినట్టు సోమవారం బీసీసీఐ ప్రకటించింది. దీంతో 2022 సీజన్ ఐపీఎల్ లో మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి.
ప్రైవేట్ ఈక్విటీ, ఇన్వెస్టిమెంట్ అడ్వైజరీ సంస్థ అయిన సీవీసీ క్యాపిటల్ పార్ట్ నర్స్ 5625 కోట్ల రూపాయలకు బిడ్ దాఖలు చేసి అహ్మదాబాద్ జట్టును దక్కించుకుంది. సంజీవ్ గోయెంకా సారథ్యంలోని ఆర్ పీఎస్ జీ గ్రూప్ 7090 కోట్లతో లక్నో ఫ్రాంచైజీని దక్కించుకుంది. దీంతో బీసీసీఐకి మొత్తం 12,715 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
ఆర్పీఎస్ జీ గ్రూప్ కు ఇప్పటికే క్రీడారంగంలో ప్రవేశం ఉంది. 2016-17 సీజన్ లో రైజింగ్ పూణె సూపర్ జెయింట్ ఫ్రాంచైజీకి యజమానిగా ఆర్పీఎస్ జీ గ్రూప్ ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ఐ- ఎస్ఎల్ క్లబ్ ఏటీకే మోహన్ బగాన్ లో ఈ గ్రూప్‌కు అత్యధిక వాటా ఉండటం గమనార్హం.
రాబోయే ఐపీఎల్ సీజన్ నుంచి ఈ రెండు కొత్త జట్ల ప్రస్థానం ప్రారంభం అవుతుంది. వచ్చే ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్ లు ఉంటాయి. అలాగే, ప్రతీ జట్టు ఏడు సొంత మైదానంలో, మరో ఏడు బయట ఆడతాయని బీసీసీఐ స్పష్టం చేసింది. బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ఈ రెండు కొత్త జట్లను ఆహ్వానించారు.