పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి బాగా లేదని గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో తెగ ప్రచారం అయ్యింది. అయితే ఈ వార్తలు అవాస్తవం అని గద్దర్ వ్యాఖ్యలని వక్రీకరించారంటున్నారు ఆర్ నారాయణ మూర్తి. చానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం కోసం వ్యూస్ కోసం తనపై అవాస్తవాలు ప్రచారం చేయవద్దని కోరారు. మీడియాతో మాట్లాడిన వీడియోని రిలీజ్ చేశారు.
చిన్నతనం నుంచి తనకు సాధారణంగా జీవించడం ఇష్టమని చాప, దిండే తనకు హాయిగా ఉంటుందని తెలిపారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అప్పులు చేయడం తీర్చడం సర్వ సాధారణం అన్నారు. తనకు ఎలాంటి కష్టాలు లేవని ఎంతో రిచ్‌గా బతుకుతున్నాని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఉండటం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నానన్న మాటల్లోనూ నిజం లేదని, తగిన స్వేచ్ఛ కోరుకునే తాను నగర శివార్లలో ఉంటున్నానని అన్నారు. నగరంలో ప్రయాణించడానికి తనకు ఆటోకి రోజుకు వెయ్యి రూపాయలు అవుతుందని, ఆ రకంగా ఆటోకే నెలకు 30 వేలు ఖర్చు చేస్తానని చెప్పారు.
ప్రభుత్వ అధికారులు కొందరు గతంలో ఇల్లు ఇస్తానని చెప్పినా తాను తీసుకోలేదని అన్నారు. సోషల్ మీడియాలో తన ఆర్థిక పరిస్థితిపై రాస్తున్న అసత్య వార్తలు తన మనసుకు బాధను కలిగిస్తున్నాయని, దయచేసి అలాంటి వాటిని ప్రచారం చేయవద్దని కోరారు.
మనశ్శాంతి కోసం పల్లెటూరిలో ఉంటున్నాను. మరి అలాంటి వార్తలు ఎప్పుడూ రాయరెందుకు? చాలా సంతోషంగా ఉన్నాను. సోషల్ మీడియాలో దయచేసి సత్యాన్ని మాత్రమే చాటిచెప్పండని నారాయణమూర్తి అన్నారు.
తన సొంతవూరిలో పలు ప్రజా ప్రయోజన కార్యక్రమాలను ఆర్. నారాయణమూర్తి చేపట్టారు. దాంతో ఆర్. నారాయణమూర్తి సహృదయత కారణంగా సినిమాల జయాపజయాలతో నిమిత్తం లేకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయనకు సినిమాల రూపకల్పనలో సహకారం అందిస్తుంటారు.