ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటే హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ చెప్పారు. ప్రధాని ఆలోచనలు ఎలా అయితే ఉన్నాయో సరిగ్గా స్పీల్ బర్గ్ ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి. ప్రధాని పూర్తిగా రాజకీయాలకు చెందిన వ్యక్తి. సినీ రంగంతో సంబంధం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి, ఎక్కడో హాలీవుడ్ లో సినిమాలు తీసుకునే స్పీల్ బర్గ్ కి ఏంటి కనెక్షన్? ప్రధాని మోదీ చెప్పిన మాటే స్పీల్ బర్గ్ రాజమౌళికి చెప్పడం ఏంటి? అసలు ప్రధాని ఏం చెప్పారు? స్పీల్ బర్గ్ ఏం చెప్పారు?
ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ సినిమా దేశవిదేశాల్లో ప్రభంజనం సృష్టించింది. ఎంతోమంది సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట అయితే ప్రపంచమంతా ఒక ఊపు ఊపేసింది. సినిమా, క్రికెట్, వ్యాపార ఆ రంగం, ఈ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల వారిని ఉర్రూతలూగించింది. అలాంటి ఈ పాటకు ఆస్కార్ రావడం నిజంగా ప్రతీ తెలుగు వారూ గర్వపడే విషయం. తెలుగు పాటకు ఆస్కార్ రావడం పట్ల ప్రముఖులంతా అభినందనల వెల్లువ కురిపించారు. ఇక రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అయితే చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలతోనే ప్రపంచ దేశాల ముందు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటారు.
ఇక నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో ఆ కీర్తి మరింత పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ వచ్చిన సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా గతంలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన విషయాన్ని ప్రస్తావించారు. కొన్ని రోజుల క్రితం తాను ప్రధానిని కలిశానని.. నాలుగు నిమిషాలు మాట్లాడతారనుకుంటే 40 నిమిషాలు మాట్లాడారని అన్నారు. ఆ 40 నిమిషాల్లో ప్రపంచం మొత్తం భారత్ వైపు ఎలా చూడాలి అనే అంశం మీద చర్చించుకున్నామని అన్నారు. మోదీ విజన్ కు తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని అన్నారు. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా కృషి చేయాలని మోదీ అన్న విషయాన్ని గుర్తు చేశారు.
సరిగ్గా మోదీ తనకు ఏం చెప్పారో.. స్పీల్ బర్గ్ కూడా రాజమౌళికి అదే చెప్పారని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రాజమౌళి స్పీల్ బర్గ్ ను కలిసిన సమయంలో ఆయన కూడా ప్రధాని మోదీలానే భారతదేశ సంస్కృతి ప్రతిబింబించేలా సినిమాలు తీయాలని సూచించారని అన్నారు. మన దేశ సంస్కృతి అంటే విదేశీయులకు బాగా ఇష్టం. ముఖ్యంగా జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ లాంటి దర్శకులకు భారతీయ సంస్కృతి అన్నా, ఇక్కడి సాంప్రదాయాలు అన్న ఎంతో మక్కువ చూపిస్తారు. జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాకి ఆదర్శం మన హిందూ పురాణాలే అని ఆయన అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రాముడి పాత్రను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన విధానానికి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు ప్రభావితం అయినట్లు చెప్పుకొచ్చారు. అందుకే భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా ఇంకా మరిన్ని సినిమాలు తీయాలని స్పీల్ బర్గ్ రాజమౌళిని కోరిన విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. ప్రధాని మోదీ కూడా ఇదే విషయం గురించి తనతో చర్చించారని ఆయన అన్నారు. మరి ప్రధాని మోదీ మాట్లాడిన మాటలే.. స్పీల్ బర్గ్ మాట్లాడడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.