ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక దిగ్గజ కంపెనీలన్నీ భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థ అయితే ఏకంగా 12 వేల మందిని తొలగించింది. అందులో ఒక గర్భిణీ.. తనను తొలగించడం పట్ల భావోద్వేగానికి గురైంది. ఇక అమెజాన్ 18 వేలు, మెటా 11 వేలు, మైక్రోసాఫ్ట్ 10 వేలు, సేల్స్ ఫోర్స్ 8 వేలు, ట్విట్టర్ 4,400 ఇలా పెద్ద కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ ఆయా కంపెనీలు 70 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. దాదాపు 70 వేల మంది జీవితాలు రోడ్డున పడ్డట్టు అయ్యింది. ఇలా దిగ్గజ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తుంటే.. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో మాత్రం భారీగా ఉద్యోగాలను ప్రకటించింది.
లింకిడ్ ఇన్ వేదికగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ టు సీఈఓ, జనరలిస్ట్, గ్రోత్ మేనేజర్, ప్రొడక్ట్ ఓనర్, సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇలా 5 విభాగాల్లో 800 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ఆసక్తి గల అభ్యర్థులు deepinder@zomato.com ని సంప్రదించమని పేర్కొన్నారు. దీంతో ఆశావహులు, నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది నిజంగా గొప్ప అవకాశమే. ముఖ్యంగా ఐటీ వాళ్లలో కొంతమందికైనా ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు. ఏ రంగమైనా కుదేలవుతుందేమో గానీ ఫుడ్ కి సంబంధించిన రంగం మాత్రం సురక్షితంగా ఉంటుంది. ఫుడ్ కి ఉన్న డిమాండ్ అటువంటిది. మరి దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్న వేళ.. జొమాటో ఉద్యోగాలను ప్రకటించడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.