ఐటీ ఉద్యోగం.. చాలా మందికి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలి అనేది కల. ఇష్టం లేకపోయినా ఇంజినీరింగ్ చేసేసి అమీర్ పేటలో కోర్సులు నేర్చేసుకుని ఐటీ ఉద్యోగి అయిపోవాలని భావిస్తారు. ఎందుకు అంత క్రేజ్ అనేది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారంలో 5 రోజులు మాత్రమే పని. సకల సౌకర్యాలు ఉండే ఆఫీసులు, అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్. కరోనా సమయంలో కూడా దిగులు, చింత లేకుండా జీతాలు రావడం. కాస్త అదృష్టం బాగుంటే ప్రాజెక్టుల మీద విదేశాలకు వెళ్లి డాలర్లు సంపాదించుకోవచ్చు. పైగా సాఫ్ట్ వేర్ అనగానే ఊర్లలో కూడా మంచి పేరు ఉంటుంది.
అయితే ఇదంతా ఇప్పటివరకు జరిగిన తీరు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆర్థిక మాంద్యం వచ్చేస్తోందని.. ఇప్పటి నుంచే ఉద్యోగులను ఇంటికి పంపడం మొదలు పెట్టారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజాల నుంచి చిన్నాచితక స్టార్టప్ల వరకు అంతా ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డారు. అందులో భాగంగానే గూగుల్ కూడా ఏకంగా 12 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ పంపింది. వారందరికీ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెల్స్ పంపారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. వారి పరిస్థితిని ఒక్కొక్కరు సోషల్ మీడియాలో వెళ్లగక్కుతున్నారు.
వారిలో ఓ గర్భిణి చేసిన లింక్డిన్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పింక్ స్లిప్ అందుకున్న వారిలో ప్రాజెక్ట్ మేనేజర్ కేథరీన్ వాంగ్ కూడా ఉన్నారు. ఆమె తన ఆవేదనను ఆ పోస్ట్ వెల్లిబుచ్చారు. “సంస్థ నుంచి ఆ ఈమెయిల్ అందగానే నాకు ఏమీ అరతం కాలేదు. నేనెందుకు? ఇప్పుడెందుకు? అనే ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఈ పరిస్థితిని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నేను ఎంతో క్లిష్టమైన ప్రాజెక్ట్ చేశాను. ముందురోజే నా పనితీరు బాగుందంటూ ప్రశంసించిన సంస్థ తర్వాతి రోజు టెర్మినేషన్ లెటర్ పంపడం విస్మయానికి గురిచేసింది.”
“ఈ లేఆఫ్స్ సిచ్యువేషన్స్ లో 34 వారాల గర్భవతిని కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, నెలల తరబడి ప్రసూతి సెలవులు తీసుకోవడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. నా గురించి, నా బిడ్డ ఆరోగ్యం గురించి మా కుటుంబం మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతికూల భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. రోజు మొత్తం కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నా బిడ్డ ఆరోగ్యం గురించి కనుక్కోవడానికి చేస్తున్నారు. నేను ఈ సమయంలో నా బిడ్డను క్షేమంగా చూసుకోవాలి. వణుకుతున్న నా చేతులను నేను నియంత్రించలేకపోతున్నాను.”
“నాకు గూగుల్ సంస్థ అన్నా.. నా టీమ్ సభ్యులన్నా చాలా ఇష్టం. మేమంతా ఒక కుటుంబంగా భావించాను. ఇలాంటి సమయాల్లో కూడా నా టీమ్ నా వెన్నంటి ఉండటం చూసి చాలా గర్వంబా భావిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న ఛాలెంజిగ్ పరిస్థితుల్లో కూడా మేము లాభాలు తీసుకొచ్చి చూపించాం. నేను ఇప్పుడు నా ఉద్యోగం గురించి ఆలోచించాలి. కానీ, నేను ఇప్పుడు నా మూడో ట్రైమిస్టర్ లో ఉన్నాను. నా బిడ్డ ఈ ప్రపంచంలోకి జాగ్రత్తగా వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను జాగ్రత్తగానే ఉంటాను.. జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. నా గురించి ఆలోచిస్తున్న వారందరికీ ధన్యవాదాలు” అంటూ కేథరిన్ వాంగ్ రాసుకొచ్చారు.