ఫ్రెండ్ కోసం మంచి పని ఏం చేసినా, అది ఎంత కష్టమైనా చేయచ్చు. అంతేగానీ ఫ్రెండ్ కోసం చేస్తున్నామని చెప్పి తప్పులూ, నేరాలూ చేయకూడదు. బీహార్‌కి చెందిన ఒక యువకుడు తనకి జాబ్ రావడం కోసం ఫ్రెండ్‌ని రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌కి పంపించాడు. ఏకంగా తన బొటనవేలు చర్మాన్ని ఒలిచి మరీ ఫ్రెండ్ చేతికి అతికించాడు. కట్ చేస్తే ఫ్రెండు, ఫ్రెండ్ మాట విన్న ఇంకొక ఫ్రెండు ఇద్దరూ జైల్లో ఉన్నారు.వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని వడోదరలో ఆగస్ట్ 22న జరిగిన రైల్వే నియామక పరీక్ష జరిగింది. బీహార్‌లోని ముంగెర్ జిల్లాకు చెందిన మనీష్ కుమార్ ఈ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. అయితే తన స్నేహితుడు రాజ్యగురు గుప్తాతో ఈ పరీక్షను రాయించాలనుకున్నాడు. “ఏరా నా బదులు నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాసొస్తావా” అనగానే ఫ్రెండ్ కూడా ఒప్పుకున్నాడు.
అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది. అదేంటంటే ఎగ్జామ్ రాసే అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫై చేస్తారు. దాని కోసం మనీష్ ఏకంగా పెద్ద స్కెచ్చే వేశాడు. వేడి వేడి పెనం మీద బొటనవేలిని పెట్టి వేలిముద్ర ఉన్న పై చర్మాన్ని బ్లేడుతో తొలగించాడు. ఆ చర్మాన్ని స్నేహితుడికి అతికించాడు. పరీక్ష కేంద్రానికి వెళ్ళిన రాజ్యగురు బయోమెట్రిక్ మెషిన్‌లో ఎన్నిసార్లు వేలిముద్ర వేసినా వెరిఫై కాలేదు. దీంతో నిర్వాహకులు రాజ్యగురు బొటనవేలిపై శానిటైజర్ స్ప్రే చేయడంతో అతికించిన చర్మం ఊడిపడింది. దీంతో షాకైన నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరి యువకులని అరెస్ట్ చేశారు. దీనిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.