కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీం 2023 ఒకటి. ఈ స్కీం ద్వారా డిస్కౌంట్ ధరకే బంగారం పొందవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెడితే వడ్డీ కూడా వస్తుంది. మార్చి 6 నుంచే ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ ఆఫర్ కేవలం 5 రోజులు మాత్రమే ఉంటుంది. మరి ఈ గోల్డ్ బాండ్స్ ఎలా కొనాలి? కొంటే వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి?
బంగారం అంటే అందరికీ ఇష్టమే. ప్రస్తుతం బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. బంగారం కొనాలంటే ఆలోచించే పరిస్థితి. అయితే అలాంటి వారి కోసమే రిజర్వ్ బ్యాంక్ అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. బంగారం కొనాలనుకునేవారికి గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడి పెట్టేలా ఆర్బీఐ విక్రయిస్తుంది. బంగారం కొనాలనుకునేవారు ఈ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేయవచ్చు. ఈ గోల్డ్ బాండ్స్ భారీ తగ్గింపుతో లభిస్తాయి. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం 2022-23 సిరీస్ 4లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గోల్డ్ బాండ్స్ ని అమ్ముతుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు తొలిసారిగా ఆర్బీఐ అవకాశం కల్పిస్తోంది.
మార్చి 6 నుంచి మార్చి 10 వరకూ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్కౌంట్ లో బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు ఏ మాత్రం ఆలస్యం చేయకండి. ఆర్బీఐ పంపిణీ చేయనున్న గ్రాము బంగారం ధర రూ. 5,611గా నిర్ణయించింది. ఈ గోల్డ్ బాండ్లలో ఎవరైనా కస్టమర్లు ఇన్వెస్ట్ చేయదలచుకుంటే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేవారికి గ్రాము వద్ద రూ. 50 మేర డిస్కౌంట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. డిజిటల్ పేమెంట్ చేయడం ద్వారా కొనుగోలు చేసినా డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఆన్ లైన్ లేదా డిజిటల్ పేమెంట్ జరిపి గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేస్తే గ్రాము బంగారం రూ. 5,561 కే లభిస్తుంది.
గుర్తింపు పొందిన బ్యాంకులు, గుర్తింపు పొందిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్, బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ ల ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. ఐతే ఎంపిక చేసిన కొన్ని పోస్టాఫీసుల్లో మాత్రమే గోల్డ్ బాండ్లను విక్రయిస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్ల టెన్యూర్ 8 ఏళ్లుగా ఉంటుంది. అయితే 5 ఏళ్ల తర్వాత ప్రీ మెచ్యూర్ రిడంప్షన్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒక మనిషి కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్టంగా 4 కిలోల వరకూ గోల్డ్ పై ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ట్రస్టులు వంటి వాటికైతే మాత్రం గరిష్టంగా 20 కిలోల గోల్డ్ పై పెట్టుబడి పెట్టుకునే వెసులుబాటు ఆర్బీఐ కల్పించింది. మెచ్యూరిటీ కాలం 8 ఏళ్లుగా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సావరిన్ గోల్డ్ లో పెట్టుబడి పెడితే.. భవిష్యత్తులో బంగారం ధర పెరిగితే లాభాలు పొందవచ్చు.
పైగా వడ్డీ కూడా వస్తుంది. గోల్డ్ బాండ్లపై తరుగు అనేది ఉండదు. ప్రస్తుతం ఉన్న ధరకు కొనుగోలు చేసి.. ధర పెరిగాక అమ్ముకోవచ్చు. చెల్లింపులు క్యాష్ రూపంలో ఉంటాయి. దొంగతనం జరుగుతుందన్న భయం ఉండదు. ఈ గోల్డ్ బాండ్లను బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు కూడా పొందవచ్చు. ఇక ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,550 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,850 వద్ద కొనసాగుతుంది. అదే సావరిన్ గోల్డ్ బాండ్ ని కొనుగోలు చేస్తే 10 గ్రాముల బంగారం ధర రూ. 55,610 కే లభిస్తుంది. ఈ ఆఫర్ ఇంకో 4 రోజులు మాత్రమే ఉంటుంది. కొనాలనుకుంటే గనుక త్వరపడండి. సావరిన్ గోల్డ్ బాండ్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.