ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఫోన్ లేకపోతే.. జీవితం ఆగిపోయినట్లే అని పరిస్థితికి చేరుకున్నాం. అయితే ప్రపంచంవ్యాప్తంగా ఏ స్మార్ట్ ఫోన్ పని చేయాలన్నా.. దానిలో ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) అత్యంత ముఖ్యమైన విభాగం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ లలో ఉన్న ఓఎస్ గూగుల్ ఆండ్రాయిడ్ లేదా యాపిల్ ఐఓఎస్ మాత్రమే. త్వరలోనే వీటికి చెక్ పెట్టాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఈ రెండు ఓఎస్ లను తలదన్నేలా.. భారత్ స్వంతంగా ప్రత్యామ్నాయ ఓఎస్‌ను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ మేరకు భారత్ కోసం ప్రత్యేకమైన ఓఎస్‌ను రూపొందించేందుకు ప్రభుత్వం తగిన సహాయ, సహకారాలు అందించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘సర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ కు చెందిన ఆండ్రాయిద్, యాపిల్ ఐఓఎస్ సిస్టమ్ లు ప్రస్తుతం మొబైల్ ఫోన్ల రంగంలపై పెత్తనం చెలాయిస్తున్నాయని.. వీటికి చెక్ పెట్టేందుకు గాను దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్‌ను(OS) రూపొందించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో పాటు, భారత ప్రభుత్వం ఆసక్తిగా ఉంది’’ అని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
‘‘దీనిపై ఇప్పటికే టెక్ నిపుణులతో పాటు, పరిశ్రమ రంగ పెద్దలతో సంప్రదింపులు మొదలుపెట్టాం. దీనిపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. కొత్త హ్యాండ్‌సెట్ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి స్టార్టప్ సామర్థ్యాలను ప్రభుత్వం వెలికితీసేందుకు కృషి చేస్తోంది’’ అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. దేశీయ టెక్నాలజీ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్‌లకు ప్రత్యామ్నాయంగా, అంతర్జాతీయ సంస్థలకు ధీటుగా స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు పారిశ్రామిక విధానాన్ని సరళీకరించనుంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.