హైదరాబాద్ చూట్టూ రీజినల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు రాబోతున్నది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కు ఈ ప్రాజెక్ట్ రాకతో వ్యాపార వాణిజ్య రంగాల్లో మరింత అభివృద్ది సాధించనున్నది.
ప్రపంచ నగరాలతో పోటీపడుతూ హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెల్తుంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ కు క్యూ కడుతున్నాయి. దేశ నలుమూలల నుంచి విద్యా, ఉపాధి అవకాశాల కోసం నగరానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. దీనికి తగినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీగా వృద్ది చెందుతున్నది. ఇలాంటి తరుణంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని వెల్లడించారు. దీని కోసం కేంద్రం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. రీజినల్ రింగ్ రోడ్ తో పాటు ఔటర్ రింగ్ రైల్ కూడా రానుండడంతో హైదరాబాద్ ఖ్యాతి మరింత పెరగనుంది.
రీజినల్ రింగ్ రోడ్ కు సమాంతరంగా ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ రానుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ మరింత అభివృద్ది పథంలో దూసుకెల్లనున్నది. ఔటర్ రింగ్ రైలు కు సంబంధించిన ప్రాజెక్ట్ వివరాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించినట్లు మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ చేపట్టడం దేశంలోనే మొట్టమొదటి సారి అని మంత్రి చెప్పారు. ఈ రింగ్ రైలు ప్రాజెక్టు రవాణా, వ్యాపార రంగాల్లో దోహదపడుతుందని మంత్రి వెల్లడించారు. అయితే ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ సర్వే కోసం కేంద్రం రూ. 14 కోట్లు కేటాయించినట్లు మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎంఎంటిఎస్ రెండో దశలో భాగంగా ఘట్ కేసర్ – రాయగిరి వరకు పనులు చేపట్టాలని రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. వీలైనంత త్వరగా ఎంఎంటిఎస్ రెండో దశ పూర్తి చేయాలని ఇండియన్ రైల్వే డిపార్ట్ మెంట్ నిర్ణయించింది.