చాట్‌జీపీటీ కారణంగా గూగుల్ బిజినెస్ బాగా దెబ్బతింది. రోజురోజుకు గూగుల్‌కు యూజర్లు తగ్గి.. చాట్‌జీపీటీకి పెరుగుతున్నారు. దీంతో భయపడిపోయిన గూగుల్ ఓ నిర్ణయం తీసుకుంది.
ChatGPT.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరిది. టెక్నాలజీ రంగంలో ఓ నూతన విప్లవంగా చాట్‌జీపీటీ తెరపైకి దూసుకువచ్చింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కు ప్రత్యామ్నాయంగా ఈ చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చింది. కొత్త టెక్నాలజీ.. పైగా గూగుల్ చేసే పనులు చేస్తుండటంతో టెక్నాలజీ ప్రియులు దీనివైపు మొగ్గుచూపారు. దీంతో లాంఛ్ అయిన కొద్దిరోజులకే చాట్‌జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ యూజర్లు తయారయ్యారు. చాట్‌జీపీటీ దెబ్బకు గూగుల్ మతిపోయింది. ఇది అలానే కొనసాగితే తమ మనుగడ కష్టం అవుతుందని గూగుల్ భావించింది.
ఈ నేపథ్యంలోనే గూగుల్ తమ సర్వీసుల్లో అద్భుతమైన మార్పులు తీసుకువచ్చింది. చాట్‌జీపీటీకి ధీటుగా తమ సర్వీసుల్లో ఏఐతో కూడిన పలు అప్‌డేట్లు చేసింది. ఈ మేరకు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఏఐతో కూడిన స్నాప్‌షాట్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాదు! జీమెయిల్‌లోనూ గూగుల్ మార్పులకు పెద్ద పీట వేసింది. స్మార్ట్ రిప్లై, స్మార్ట్ కంపోస్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్ ద్వారా మీకు అవసరమైన మెయిల్స్‌ను ఏఐ రాసి పెడుతుంది. మీరు చేయాల్సిందల్లా.. మీకు ఏం కావాలో దానికి సూచనలు ఇవ్వటమే. ఇలా చేయటం ద్వారా ఏఐ మనకు అవసరమైన మెయిల్స్ చకచకా రాసేస్తుంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాడుతున్న గూగుల్ మ్యాప్స్‌లోనూ మార్పులకు గూగుల్ శ్రీకారం చుట్టింది.
త్వరలోనే ఓ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ‘‘ఇమెన్స్ వ్యూ ఫర్ రూట్’’ ఫీచర్ ద్వారా యూజర్లకు కచ్చితమైన డిజిటల్ రూటు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీని ద్వారా మనమే ఆ రూటులోకి వెళ్లి తిరుగుతున్న భావన కలుగుతుంది. మనకు కావాల్సిన ప్రదేశాన్ని ఇట్టే తెలుసుకోవచ్చు. అయితే, ఈ ఫీచర్ కేవలం 15 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. అది కూడా ఈ ఏడాది చివరకు అందుబాటులోకి వస్తుంది. వీటితో పాటు గూగుల్ ఫొటోస్‌లో మ్యాజిక్ ఫొటోస్ ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఓ ఫొటోలోని వివిధ భాగాలను పక్కకు కదిలించవచ్చు. అంతేకాదు! ఆటో జనరేషన్ ఫంక్షన్ ద్వారా ఆ ఫొటోలో మిస్సయిన భాగాల్ని కూడా అతికించుకోవచ్చు.
తమ ప్రత్యర్థి చాట్‌జీపీటీని నిలువరించడానికే గూగుల్ ఏఐ టెక్నాలజీతో కూడిన ఈ మార్పులు తీసుకువచ్చిందనటంతో ఎలాంటి అనుమానం లేదు. అయితే, దీని కారణంగా గూగుల్ ఆర్థికంగా నష్టపోవటం అయితే ఆగదు. ఈ అప్‌డేట్ల కారణంగా నష్టం తీవ్రత తగ్గుతుంది. ఏది ఏమైనప్పటికి గూగుల్ తమ ప్రత్యర్థిని ఎదుర్కోవటానికి తీసుకువచ్చిన ఈ అప్‌డేట్లు యూజర్లుకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. యూజర్ల పని మరింత సులభంగా పూర్తవుతుంది. మరి, చాట్‌జీపీటీని నిలువరించేందుకు గూగుల్ తీసుకువచ్చిన ఈ అప్‌డేట్లపై మీ అభిప్రాయలను కామెంట్ల రూపంలోతెలియజేయండి.