అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఈరోజు.

కరోనా మహమ్మారిపై పోరాటంలో వైద్యులతో పాటు నర్సుల పాత్ర కూడా ఎంతో కీలకం. వీరంతా తమ ప్రాణాలను సైతం ఫణంగా పెడుతూ బాధితులకు నిరంతర సేవలు అందిస్తున్నారు. వైద్యరంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకొచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రజల ఆరోగ్యరక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తుచేసుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820, మే 12న ఇటలీలో జన్మించింది. 1853న లండన్‌ లోని ఓ స్త్రీల ఆస్పత్రిలో సూపరిండెంట్‌గా చేరిన నైటింగేల్, 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకొని వెళ్ళింది. 1859లో ‘నోట్స్‌ ఆన్‌ నర్సింగ్‌’ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్‌, ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది. నైటింగేల్‌ సేవలను గుర్తించిన ‘ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నర్సెస్‌’ సంస్థ 1965 నుండి నైటింగేల్‌ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. భారతదేశంలో. ఈ రోజున, నర్సింగ్ విభాగంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను అందిస్తారు. 1973లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రవేశపెట్టిన ఈ అవార్డులో భాగంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత, స్వచ్ఛంద సంస్థల్లో విశిష్ట సేవలందించిన నర్సులకు ఒక పతకం, ప్రశంసాపత్రము, జ్ఞాపికతోపాటు 50వేల రూపాయిల నగదు బహుమతిని బహుకరిస్తారు.

maxresdefault 9

నర్సింగ్ విభాగ ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి సముచిత గౌరవం ఇవ్వడం హర్షించదగిన విషయం. ఈ సందర్బంగా నర్సులకు ప్రజా ఆరోగ్యానికి, సమాజానికి ఉన్న సంబంధం వారికి ఉన్న సమస్యలు కూడా సమాజం తెలుసుకోవాలి ప్రధానంగా ప్రభుత్వాలు తెలుసుకొని బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేసి ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా వైద్య సిబ్బందికి సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరముంది. తరతరాల చరిత్ర నర్సులకు ఉంది పూర్వ కాలంలో మంత్రసాని వ్యవస్థ ఉండేది సైన్స్ అభివృద్ధి కావడంతో నర్సింగ్ వ్యవస్థ వచ్చింది. ఇప్పటికి ఆదివాసీ మారుమూల ప్రాంతాల్లో మంత్రసాని సహాయంతోనే ప్రసవాలు జరుగుతున్నాయి. మన దేశంలో 1871 లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మొట్టమొదట నర్సింగ్ స్కూళ్లను ప్రారంభించారు. విద్య, వైద్య రంగాన్ని మొత్తంగా ప్రభుత్వ పరం చేసి అందరికి సమాన విద్య సమాన వైద్యం అందిచాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా మన పాలకులు గుర్తించాలి. మనదేశ ఆర్టికల్ 21 ప్రకారం ప్రజా ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదేనని మన పాలకులు గుర్తించాలి.