తిరుమల- కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి నిలయం తిరుమల తిరుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మన దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అందుకే తిరుమల ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామి ని ఆపద మొక్కులవాడని పిలుస్తారు. అంటే మనం కోరిన కోరికలు తీర్చాలని మొక్కులు మొక్కుతే, ఆ కోర్కెలను తీరుస్తాడని భక్తుల నమ్మకం.
అందుకే తిరుమల వెళ్లే భక్తులంతా తమ స్థాయి మేరకు, తాము మొక్కిన మేరకు శ్రీవారికి కానుకలు సమర్పిస్తుంటారు. డబ్బులు, వస్తువుల రూపంలో స్వామి వారి హుండీలో వేస్తుంటారు. మరి కొందరు భక్తులు పెద్ద మొత్తంలో శ్రీవారికి డబ్బులు విరాళంగా ఇస్తుంటారు. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వరంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు ఓ భక్తుడు భారీ విరాళం ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన రవి అనే శ్రీవారి భక్తుడు ఏకంగా 4 కోట్ల 20 లక్షలు విరాళంగా ఇచ్చాకు.
ఈ మేరకు 4 కోట్ల 20 లక్షల రూపాయల మొత్తానికి సంబంధించిన చెక్కును సోమవారం తిరుమలలో టీటీడీ అధికారులకు అందించారు. మరో 2 కోట్ల 40 లక్షల విరాళం ఇవ్వడానికి కూడా ఆ భక్తుడు అంగీకరించాడు. హైదరాబాద్ కు చెందిన ఈ భక్తుడు ఇచ్చిన విరాళంతో ఎస్వీబీసీ యాజమాన్యం ఛానల్ కోసం కొత్త కెమరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
ఇక ఈ సంవత్సరం మార్చిలో ముంబయికి చెందిన సంజయ్ సింగ్ అనే వ్యాపారవేత్త శ్రీవారికి 300 కోట్ల రూపాయల భారీ విరాళం ప్రకటించారు. 300 కోట్ల రూపాయలతో తిరుపతిలో 300 పడకల ఆసుపత్రిని ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు టీటీడీతో సంజయ్ సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. మరోవైపు తమిళనాడుకు చెందిన భక్తుడు గురు కుమార్ శ్రీవారికి 23 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి స్వామిపై తన భక్తిని చాటుకున్నారు. కరోనా నేపధ్యంలో భారీగా పడిపోయిన స్వామివారి హుండీ ఆదాయం, మళ్లీ ఈ మధ్యకాలంలో మెల్లిమెల్లిగా పెరుగుతోంది.