భారీ వర్షాలకు జలదిగ్భంధంలో తిరుమల తిరుపతి

తిరుపతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. విస్తారంగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తం అవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అతి భారీ వానలు పడుతున్నాయి. తిరుపతిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇక భారీ వర్షాలకు శ్రీవారి సన్నిది తిరుమల అతలాకుతలం అవుతోంది. స్థానికంగా రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరదనీరే కనిపిస్తోంది. తిరుమల రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Tirumala

భారీ వర్షాల కారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదల్లో చిక్కుకున్న భక్తులకు టీటీడీ వసతి సౌకర్యం ఏర్పాటు చేేసింది. వసతి కోసం ఇబ్బంది పడుతున్న భక్తుల కోసం తిరుమలలోని శ్రీనివాసం, మాధవం, రెండు, మూడో సత్రాలలో టీటీడీ అధికారులు వసతి ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. తిరుమలలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

తిరుపతి బస్టాండులో మొత్తం నీరు చేరింది. భారీ వర్షాలకు తోడు ఈదురుగాలులు వీస్తుండడంతో వృక్షాలు నెలకొరిగాయి. అటు ఈ నేపధ్యంలో ప్రజలు బయటకి రావొద్దని తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు హెచ్చరించారు. భారీ వర్షాలు కురుస్తూండడంతో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆయన చెప్పారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకి రావద్దని ఆయన సూచించారు.