క్షమాపణలు కోరిన మోస్ట్ వాంటెడ్ భాయ్‌!.

దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత సల్మాన్ మనసు మార్చుకుని థియేటర్లలో కూడా ఈ సినిమాని విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్‌తో దేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో సినిమాని థియేటర్లలో విడుదల చేయడం అనేది అసాధ్యం. ‘రాధే’ చిత్రం మే 13న విడుదల కాబోతోన్న సందర్భంగా సల్మాన్ జూమ్‌లో మీడియాతో ముచ్చటించారు.

thequint 2021 04 22c151fb a5b2 415d 8103 4e6eca997779 sm

ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘రాధే సినిమాతో లాభాలు సంపాదించాలని ఆశించిన థియేటర్స్ యజమానులందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాధే చిత్ర బాక్సాఫీస్ కలెక్షన్స్ జీరో అవుతున్నందుకు. సల్మాన్ సినిమాలకు ఇంతకు ముందెన్నడూ ఇది జరగలేదు. పరిస్థితులు కాస్త మెరుగగా ఉన్నప్పుడు ఈ చిత్రాన్ని థియేటర్లలో కూడా విడుదల చేస్తానని తెలిపాను. కానీ ఇప్పుడు కేవలం ఓటీటీ మరియు అబ్రాడ్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే సినిమాని విడుదల చేయనున్నాం. ఇక్కడ పరిస్థితులన్నీ బాగుండి ఉంటే ఖచ్చితంగా థియేటర్లలో విడుదల చేయాలనే అనుకున్నాం. కానీ థియేటర్లన్నీ మూతపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియదు. అందుకే ఈ రంజాన్‌కి సినిమాని ఓటీటీలో విడుదల చేస్తున్నాం. ఇది సరైన నిర్ణయమే అని అనుకుంటున్నాను. అయితే ప్రేక్షకులందరికీ ఒక మాట ఇస్తున్నాను. ఓటీటీలో విడుదలైనా పరిస్థితులన్నీ చక్కబడి, థియేటర్లు తెరుచుకున్నాక సినిమాని థియేటర్లలో విడుదల చేస్తాము. ఎందుకంటే, థియేటర్లలోనే సినిమా చూడాలని భావించే వారి కోసం, అలాగే ఓటీటీలో చూడని వారి కోసం మీ మోస్ట్ వాంటెడ్ భాయ్‌ని మళ్లీ థియేటర్లలోకి తీసుకువస్తామని తెలియజేస్తున్నాను.’’ అని తెలిపారు.