ఆంధ్రప్రదేశ్ మళ్లీ వాన ముప్పు.. రాబోవు 72 గంటల్లో భారీ వర్షాలు

అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వానలు వెంటాడుతున్నాయి. మూడు రోజుల క్రితం కురిసిన కుండపోత వర్షాలతో ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాన గండం భయపెడుతోంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాబోవు 72 గంటల్లో ఏ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది.

దక్షిణ అండమాన్‌ సముద్రం, పరిసర ప్రాంతాల్లో తక్కువ ట్రోపోస్పియరిక్‌ స్థాయిల్లో సర్క్యులేషన్‌ ఉందని వాతావరణ నిపుణలు గుర్తించారు. రాబోయే నాలుగైదు రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది. దీనికి తోడు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తోంది. దీంతో మరో 72 గంటల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. మరో 72 గంటల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Rains in AP

మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్థంబించిపోయింది. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు ధ్వసం అయ్యాయి. రవాణా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం యుధ్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. మొన్న కురిసిన వానల విధ్వసం నుంచి తేరుకోక ముందే మరో సారి వర్షాల హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.

రాబోవు 72 గంటల్లో కరువనున్న వర్షాలు ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలోనూ ప్రభావం చూపనున్నాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. 72 గంటల్లో రాయలసీమతో పాటు కోస్తాంధ్రలోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఈ నెల 26 నుంచి డిసెంబరు 2 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయ్యింది.