సైమన్ డౌల్ ఎమోషనల్ వీడ్కోలు సందేశం!..

భారత్‌లో కోవిడ్‌ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్‌ 2021కీ  కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్‌ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్‌ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్‌ చేశాడు. ఈ విపత్కర  సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు.  దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్‌ తన ట్వీట్‌ రూపంలో తెలిపారు. ప్రియమైన భారతదేశం, చాలా సంవత్సరాలుగా నాకు చాలా ఇచ్చారనీ ఇలాంటి విపత్కర సమయాల్లో విడిచి పెట్టినందుకు నన్ను క్షమించండి. దయచేసి సురక్షితంగా ఉండటానికి చేయదగినది చేయండి. పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు మాత్రం జాగ్రత్త వహించండని డౌల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడంతో ఇదివరకే ఆడమ్ జాంపా, కేన్ రిచర్డ్సన్ వంటి పలువురు విదేశీ ఆటగాళ్లు టోర్నమెంట్ మధ్య లోనే తమ దేశాలకు పయనమయ్యారు. ఐపీఎల్‌ 2021 అహ్మదాబాద్‌లో మే 30 వరకు 60 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా కేవలం 29 మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. అయితే, ఇద్దరు కేకేఆర్ ఆటగాళ్లుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కావడంతో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ 29 ను సోమవారం రీ షెడ్యూల్ చేశారు. కానీ ప్రస్తుత పరిణామాలు దృష్ట్య లీగ్‌ మొత్తాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఐపీఎల్ కు సంబంధించి కేవలం వాయిదా మాత్రమే వేస్తున్నట్లు రద్దు చేయలేదని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మంగళవారం స్పష్టం చేశారు.