డబ్బు డబ్బు నువ్వు ఏం చేస్తావు అంటే మనుషుల ఎమోషన్స్ తో ఆడుకుంటాను అని అన్నదట. నిజానికి డబ్బు మాట్లాడటం ఏమిటండి, విచిత్రం కాకపోతే. పాపం దానికేమీ తెలియదు. నోరు లేని మూగ జీవి. కానీ మనిషే మొత్తం తప్పంతా డబ్బుదే అని డబ్బు మీద తోసేస్తాడు. అది సరే గానీ కరెన్సీ నోటు మీద బోసి నవ్వులు నవ్వుతూ గాంధీ తాత బొమ్మ కనిపిస్తుంది కదా. మరి ఆ నోటు చూసినప్పుడు మీకు కొన్ని సందేహాలు వచ్చి ఉంటాయే. గాంధీ చిత్రం మాత్రమే ఎందుకు నోటు మీద పెట్టారు? పర్టిక్యులర్ గా ఈ ఫోటోనే ఎందుకు పెట్టారు? ఆ ఫోటోలో ఏమైనా ప్రత్యేకత ఏంటి? అసలు గాంధీ ఫోటో కంటే ముందు మన కరెన్సీ నోటు మీద ఏ చిత్రం ఉండేది? గాంధీ చిత్రం మొట్టమొదటిసారిగా ఎప్పుడు ముద్రించారు? ఇలాంటి ప్రశ్నలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? అయితే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇక్కడ దొరుకుతుంది.
స్వాతంత్య్రం తర్వాత.. ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించింది. ఆ సమయంలో కరెన్సీ నోట్ల మీద మన జాతీయ చిహ్నం ఉండేది. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైన సింహాలతో ఉన్న జాతీయ చిహ్నం కరెన్సీ నోటు మీద ఉండేది. 90స్ లో, ఆ ముందు జన్మించిన వాళ్ళు ఈ నోటుని చూసే ఉంటారు. అశోక స్తంభం మీద సింహం బొమ్మలు ఉంటాయి. నోట్ల మీదే కాదు, నాణాల మీద కూడా ఈ చిహ్నం ఉంటుంది. ఈ జాతీయ చిహ్నం కంటే ముందు 4వ కింగ్ అయిన జార్జ్ ఫోటో ఉండేది. 1938 నుంచి 11 ఏళ్ల పాటు కరెన్సీ నోట్ల మీద ఈ బొంగ్ జార్జ్ గాడి ఫోటో నడిచింది. మొదటగా 5 రూపాయల నోటుని 1938 జనవరి నెలలో ముద్రించగా.. ఆ తర్వాత ఫిబ్రవరి నెలలో 10, మార్చి నెలలో 100, 1000, 10,000 నోట్లను ముద్రించారు. ఆ తర్వాత బొంగ్ జార్జ్ ఫోటో తీసేసి మన జాతీయ చిహ్నాన్ని పెట్టారు.
1935 నుంచి ఆర్బీఐ కరెన్సీ కంప్ట్రోలర్ గా పనిచేస్తుంది. అయితే మొట్ట మొదటిసారిగా గాంధీ చిత్రాన్ని ప్రచురించింది మాత్రం 1969లోనే. 1960 ప్రారంభంలో ఆర్థికంగా చాలా బీదరికంలో ఉండేది. ఆ సమయంలో జనాలకు తిండి కూడా దొరకడం కష్టంగా ఉండేది. అప్పటి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని 1967లో నోట్ల సైజుని తగ్గించారు. మహాత్మా గాంధీ శత జయంతిని పురస్కరించుకుని.. సేవాగ్రాం ఆశ్రమంలో కూర్చుని ఉన్న ఫోటోని 1969లో 2, 5, 10, 100 రూపాయల నోట్ల మీద ముద్రించింది. రూపాయి నోట్ల మీద మాత్రం గాంధీ సైడ్ ఫేస్ ని ముద్రించింది. అయితే 1996 ముందు వరకూ కొన్ని నోట్ల మీద మాత్రమే గాంధీ బొమ్మ ఉండేది. 1996 తర్వాత నుంచి మాత్రం పూర్తిగా గాంధీ చిత్రంతో కూడిన కరెన్సీ నోట్లను ముద్రిస్తూ వచ్చింది. అయితే 1996లో జాతీయ చిహ్నాన్ని తీసేసి.. మహాత్మా గాంధీ చిత్రంతోనే కొత్త నోట్లను ముద్రించింది.
అప్పటి వరకూ కరెన్సీ నోట్లు సింబల్స్ కలిగి ఉండేవి. నిర్జీవంగా ఉన్న సింబల్స్ ని అయితే సులువుగా ఫోర్జరీ చేస్తారని.. అదే సింబల్స్ స్థానంలో మనిషి చిత్రం ఉంటే ఫోర్జరీ చేయడం కష్టం అవుతుందని భావించిన ఆర్బీఐ.. మహాత్మా గాంధీ చిత్రాన్ని ఎంచుకుంది. మనిషిని డూప్లికేట్ చేయడం కష్టమవుతుందని భావించిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకూ 20 రూపాయల నోట్ల మీద ఒడిశా కోణార్క్ ఆలయ చక్రం, వెయ్యి రూపాయల నోట్ల మీద తంజావూరులోని బృహదీశ్వర ఆలయం, 5 వేల నోట్ల మీద గేట్ వే ఆఫ్ ఇండియా ఇలా రకరకాల ప్రాంతాలకు చెందిన ప్రముఖ స్థలాలకు సంబంధించిన సింబల్స్ ఉండేవి.
మనిషి బొమ్మని పెట్టాలనుకుంటే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, ప్రకాశం పంతులు, వల్లభభాయ్ వేరే నాయకుడి చిత్రాన్ని ఎందుకు పెట్టలేదు అంటే దానికొక కారణం ఉంది. ప్రతీ నాయకుడు కూడా ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారు కావడం వల్ల.. వాళ్లలో ఒకరిని కరెన్సీ నోటు మీద ముద్రిస్తే.. మిగతా ప్రాంతాల వాళ్ళు ఫీలవుతారని.. ప్రాంతీయ బేధాలకు తావివ్వకుండా.. మొత్తం జాతి మొత్తం ఆమోదించగలిగే వ్యక్తి ఫోటో కరెన్సీ నోటు మీద ఉంటే బాగుంటుందని భావించారు. అలా జాతి పితగా పేరొందిన గాంధీ చిత్రాన్ని కరెన్సీ నోటు మీద ముద్రించారు.
ఈ ఫోటో చూస్తే ఎవరైనా డ్రాయింగ్ వేసారేమో అనుకుంటారు. కానీ ఇది నిజమైన ఫోటోనే. వైశ్రాయ్స్ హౌజ్ లో (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) లార్డ్ ఫ్రెడ్రిక్ పెథిక్ లారెన్స్ ని గాంధీ కలిసినప్పుడు తీసిన ఫోటో అది. అయితే దీన్ని ఎవరో గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ 1946లో తీశారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ నవ్వుతున్న ఫోటోని క్రాప్ చేసి 1987లో నోట్ల మీద ముద్రించారు. 1996లో ఆర్బీఐ అడ్వాన్స్డ్ టెక్సెక్యూరిటీ ఫీచర్స్ తో గాంధీ బొమ్మతో కూడిన కరెన్సీ నోట్లను మళ్ళీ పరిచయం చేసింది.
రెప్రోగ్రాఫిక్ టెక్నిక్స్, ట్రెడిషనల్ సెక్యూరిటీ ఫీచర్స్ సరిపోవని.. కంటి చూపు లేని వారికి కూడా గుర్తుపట్టేలా.. వాటర్ మార్క్, విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్, లేటెంట్ ఇమేజ్, ఇంటాగ్లియో ఫీచర్స్ తో కూడిన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికీ గాంధీ చిత్రంతోనే కరెన్సీ నోట్లు చలామణి అవుతున్నాయి. అయితే ఆర్బీఐ మొన్నా మధ్య డిజిటల్ రూపీని పరిచయం చేసింది. దీని మీద గాంధీ బొమ్మ లేకపోవడంతో.. గాంధీ ముని మనవడు కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మ తొలగించండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నెటిజన్స్ కూడా భిన్నంగా స్పందించారు. కరెన్సీ నోట్లకు సంబంధించిన పూర్తి చరిత్ర తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.