కరెంట్ తీగలను పట్టుకుంటే మనకి షాక్ కొడుతుంది. కానీ పక్షులు ఆ తీగల మీద వాలినప్పుడు కరెంట్ షాక్ అనేది కొట్టదు. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
మామూలుగా సాధారణ కరెంట్ తీగను పట్టుకుంటేనే మనకి షాక్ కొడుతోంది. అటువంటిది ఒక పక్షి హైవోల్టేజ్ కరెంట్ తీగలపై కూర్చున్నా గానీ ఆ పక్షులకు ఏమీ అవ్వడం లేదు. అసలు అవి ఎటువంటి కరెంట్ షాక్ లేకుండా తీగల మీద ఎలా నిలబడగలుగుతున్నాయి. అయితే దీని గురించి తెలుసుకునే ముందు విద్యుత్ ప్రవాహం గురించి తెలుసుకోవాలి. ఎలక్ట్రాన్లు ఒక చోట నుంచి మరొక చోటికి ప్రవహించడాన్ని ఎలక్ట్రిక్ కరెంట్ అని అంటారు. ఎలక్ట్రాన్లు విద్యుత్ కేంద్రం నుంచి మెయిన్స్ ద్వారా ఇంటి దగ్గర ఉన్న మీటర్ లోకి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత కరెంట్ తీగల సహాయంతో ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎలక్ట్రాన్లు అనేవి చేరతాయి. మళ్ళీ అదే విద్యుత్ తీగ సహాయంతో మెయిన్స్ కి అనుసంధానం అవుతుంది. ఇదంతా ఒక వలయంలా ఉంటుంది.
కరెంట్ ప్రవహించాలంటే క్లోజ్డ్ లూప్స్ ఉండాలి. అలానే ఎలక్ట్రాన్లు ప్రవహించాలన్నా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లో తేడాలు ఉండాలి. మామూలుగా ఈ ఎలక్ట్రాన్లు ఎక్కువ పొటెన్షియల్ నుంచి తక్కువ పొటెన్షియల్ వైవు ప్రవహిస్తాయి. ఒక పక్షి కరెంట్ తీగ మీద నిలబడితే.. దాని రెండు కాళ్ళు ఒకే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లో ఉంటాయి. అందుకే ఎలక్ట్రాన్లు పక్షి శరీరం నుంచి ప్రవహించవు. ఎలక్ట్రాన్లు ప్రవహించలేదంటే దానర్థం విద్యుత్ లేదని అర్థం. అందుకే పక్షికి ఏమీ కాదు. ఒకవేళ పక్షి మరొక తీగను తగులుకుంటే.. ఆ తీగ భిన్నమైన ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కలిగి ఉంటే అప్పుడు ఎలక్ట్రాన్లు ఆ తీగ గుండా ప్రవహిస్తాయి. ఈ కారణంగా పక్షి షాక్ కి గురై చనిపోతుంది.
కొన్ని సార్లు కాకులు, పెద్ద పెద్ద పక్షులు వంటివి షాక్ కి గురై చనిపోతాయి. దీనికి కారణం తీగలపై వాలిన తర్వాత అవి రెక్కలు చాచిన్నప్పుడు మరొక తీగకు తగులుతుంది. అందుకే కరెంట్ ప్రసరించి అవి మరణిస్తాయి. కరెంట్ తీగలకు సపోర్ట్ గా కర్రను నిలబెట్టినప్పుడు.. పక్షులు ఆ కర్ర మీద నిలబడితే అవి షాక్ కి గురై చనిపోతాయి. ఎందుకంటే భూమికి ఆనించి కర్రను నిలబెడతారు. భూమికి ఆనుకుని ఉండడం వల్ల తక్కువ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉంటుంది. ఒకవేళ పక్షి ఆ పోల్ మీదకు వచ్చి వేరే తీగను టచ్ చేస్తే వెంటనే పక్షి శరీరంలోకి కరెంటు ప్రసరిస్తుంది. హైవోల్టేజ్ వైర్ నుంచి తక్కువ పొటెన్షియల్ కలిగిన కర్రకు పక్షి శరీరం ద్వారా కరెంటు పాసవుతుంది.
మనుషుల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది. మనం భూమ్మీద నిలబడి ఉండగా ఏదైనా కరెంట్ వైర్ ని పట్టుకుంటే ఆ వైర్ లోని పొటెన్షియల్, కింద నేలపై ఉన్న పొటెన్షియల్ భిన్నంగా ఉంటాయి. ఈ కారణంగా శరీరంలోకి కరెంట్ ప్రవహిస్తుంది. గాల్లో ఉండగా కరెంట్ వైరుని పట్టుకుంటే ఏమీ కాదు. కానీ కాలు నేలకు తగిలినా.. లేదా ఏ వస్తువు ద్వారా అయినా నేలకు తగిలినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది. అందుకే కరెంటు తీగలపై పని చేసే సిబ్బంది రబ్బరు గ్లౌజులను వాడతారు. కొన్ని సందర్భాల్లో విద్యుత్ వైర్లకు మరమ్మత్తులు చేసే సిబ్బంది భూమిపై ఎక్కడా కాలు పెట్టకుండా జాగ్రత్తపడతారు. ఒకసారి ఒక కరెంటు తీగను మాత్రమే తాకేలా జాగ్రత్తలు తీసుకుంటారు.