డెబిట్ కార్డు లేదా ఏటీఎం కార్డు మీద కార్డు ఎక్స్ పైరీ తేదీ, వెనుక సీవీవీ, 16 అంకెలతో కూడిన ఒక నంబర్ ఉంటాయి. ఎక్స్ పైరీ తేదీ, సీవీవీ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ 16 అంకెలు ఎందుకుంటాయో తెలుసా?
డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల మీద 16 అంకెల నంబర్ ఒకటి ఉంటుంది. వీసా డెబిట్ కార్డ్, వీసా ఎలక్ట్రానిక్ డెబిట్ కార్డ్, మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డ్, మాస్ట్రో డెబిట్ కార్డ్, రూపే డెబిట్ కార్డ్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డ్ ఇలా పలు రకాల డెబిట్ కార్డులు ఉన్నాయి. క్రెడిట్ కార్డుల్లో కూడా వీసా, మాస్టర్, మాస్ట్రో, రూపే ఇలా పలు రకాలు ఉంటాయి. అయితే ఈ కార్డుల మీద 16 అంకెల నంబర్ తో పాటు ఎక్స్ పైరీ తేదీ, ఖాతాదారుని పేరు, డెబిట్ కార్డు రకం, వెనుక సీవీవీ నంబర్ ఉంటాయి. సీవీవీ నంబర్ అంటే కార్డ్ వెరిఫికేషన్ వేల్యూ అని అర్థం. ఇది మూడు అంకెలతో ఉంటుంది. కొన్ని కార్డుల్లో సీవీసీ అని ఉంటుంది. ఇది నాలుగు అంకెలతో ఉంటుంది. సీవీసీ అంటే కార్డు వెరిఫికేషన్ కోడ్ అని అంటారు. లావాదేవీలు జరిపినప్పుడు ఈ సీవీవీ లేదా సీపీవీ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి.
అయితే 16 అంకెల నంబర్ పెట్టడానికి కారణం ఏమిటి? ఈ 16 అంకెల వెనుక కీలక సమాచారం దాగుందన్న విషయం మీకు తెలుసా? ఈ 16 అంకెల సంఖ్యని పర్మినెంట్ అకౌంట్ నంబర్ అని కూడా అంటారు. అయితే ఈ సంఖ్యలో మొదటి ఆరు అంకెలు బ్యాంక్ ఐడెంటిఫికేషన్ నంబర్ కాగా.. మిగతా 10 అంకెలు కార్డ్ హోల్డర్ యొక్క యూనిక్ అకౌంట్ నంబర్. అయితే ఇందులో మొదటి అంకె మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైర్ కి సంకేతం. అంటే ఈ కార్డు ఏ నెట్వర్క్ కి చెందిందో తెలియజేసే అంకె. ఇక్కడ నెట్వర్క్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంస్థలు. ఇవి వీసా, మాస్టర్ కార్డ్, రూపే వంటి కార్డులను జారీ చేస్తాయి. డెబిట్ కార్డులోని 16 అంకెల్లో మొదటి ఆరు అంకెలన్నీ కలిపితే ఐఐఎన్ (ఇష్యూయర్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్) అని అంటారు.
ఈ ఆరు అంకెల నంబర్ ఆధారంగా ఏ బ్యాంకు కార్డుని జారీ చేసిందో గుర్తుపట్టడానికి వీలవుతుంది. 7 నుంచి 15 అంకెలు కార్డుదారుని యొక్క డెబిట్ కార్డుతో లింక్ అయి ఉన్న యూనిక్ బ్యాంకు ఖాతాని సూచిస్తుంది. కానీ బ్యాంకు ఖాతా నంబర్, ఇదీ వేరువేరుగా ఉంటాయి. ఇక చివరి అంకె 16వది.. దీన్ని చెక్ సమ్ అంటారు. డెబిట్ కార్డు చెల్లుబాటును ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇక డెబిట్ కార్డులో ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్ హోలోగ్రామ్ ఉంటుంది. ఇది ఒక రకమైన సెక్యూరిటీ హోలోగ్రామ్. దీన్ని కాపీ చేయడం చాలా కష్టం. ఇది 3 డైమెన్షనల్ సెక్యూరిటీ కార్డు. క్రెడిట్ కార్డులో ఉన్న 16 అంకెల వెనుక ఉన్న కీలక విషయాలు కూడా ఇవే.