భారత రైల్వే వ్యవస్థ రైలు ప్రమాదాల నివారణకు పలు సింబల్స్ ను, సిగ్నల్స్ ను ఉపయోగిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ట్రాక్ ల మధ్యలో కంకర రాళ్లను ట్రాక్ చుట్టూ నింపుతుంది. మరి ఈ రాళ్లను ఎందుకు వినియోగిస్తారో తెలుసా.
రవాణా వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తుంది ఇండియన్ రైల్వే. నిత్యం వేలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తూ ప్రజల నుంచి మంచి ఆదరణ పొందింది. రైలు ఛార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండడంతో ఎక్కువగా రైలు ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ సురక్షితంగా చేరవేస్తుంటుంది. వర్తక వాణిజ్యంలో కూడా ఇండియన్ రైల్వేస్ ముఖ్యపాత్ర పోషిస్తోంది. కాగా రైల్వే ట్రాక్ విషయానికొస్తే.. పట్టాల మధ్యలో కంకర రాళ్లతో నిండి ఉండడం మనం చూస్తుంటాం. కానీ అలా ఎందుకు వేస్తారో మనలో చాలామందికి తెలియదు. ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం.
రైల్వే ట్రాక్ పై పట్టాల మధ్యలో కంకర రాళ్లతో నింపేస్తుంటారు రైల్వే సిబ్బంది. ఈ కంకర రాళ్లను ట్రాక్ బ్యాలస్ట్ గా పిలుస్తారు. దీనికి గల కారణం ఏంటంటే.. పట్టాలు నిర్ధిష్ట స్థానంలో ఉండేందుకు కంకరను పట్టాల మధ్యలో, ఇరువైపుల పోస్తుంటారు. రైలు భారీ కంపార్ట్‌మెంట్లతో పెద్దగా ఉన్న రైలు, పట్టాలపై వెళ్తుంటే భారీ శబ్ధాలు వస్తుంటాయి. పెద్ద శబ్దంతో పాటు సమీపంలోని నిర్మాణాలు, భవనాలకు ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం తొలగించడానికే ఈ పదునైన రాళ్లను ఉపయోగిస్తారు. శబ్ధాలను ఈ రాళ్లు తగ్గిస్తాయి. ట్రాక్ పై పిచ్చి మొక్కులు పెరగ కుండా నివారించేందుకు కంకరను ఉపయోగిస్తారు. వర్షం పడ్డప్పుడు నీరు ట్రాక్ పై నిలవకుండా ఉండేందుకు కంకర రాళ్లను ఉపయోగిస్తారు. పట్టాల మధ్య ఉన్న కంకర రాళ్లతో రైలు సురక్షితంగా ప్రయాణించగలదు.