ఈ ధనవంతులని, పేదలను ఒకే రైలులో పెట్టారు చూడండి.. ఈ సిస్టం అని అనాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏసీ బోగీలు ఎక్కువైపోయి.. జనరల్ బోగీలు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి కదా. ఏసీ ప్రయాణికులకు ఏసీ రైళ్లు, సాధారణ ప్రయాణికులకు జనరల్ బోగీలతో కూడిన రైళ్లు నడిపితే ఏ సమస్య ఉండదు కదా అని మీకు అనిపించిందా? రైల్వే శాఖ అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.
రైల్వే శాఖ, చాలా వరకూ రైళ్లలో ఏసీ బోగీలు, స్లీపర్ క్లాస్ లు పెంచేసి సాధారణ బోగీలను తగ్గించేసిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సాధారణ ప్రయాణికులు, పేదలు ప్రయాణించాలంటే ఆ బోగీలు సరిపోవడం లేదు. మునుపటిలా ఉన్నప్పుడే కిక్కిరిసిపోతూ ప్రయాణించేవారు. ఇప్పుడు బోగీలు తగ్గించేసరికి ఈ సమస్య మరింత ఎక్కువైంది. ఈ సమస్యకు భారతీయ రైల్వే చెక్ పెట్టనుంది. ఏసీ బోగీల ప్లేస్ లో జనరల్, స్లీపర్ బోగీలను పెట్టి కొత్త రైళ్లను నడపాలని భావిస్తుంది. రైళ్లలో నిత్యం వలస కార్మికులు, చేతి వృత్తుల వారు పనుల కోసం నగరాలకు, పట్టణాలకు వలస వెళ్తుంటారు. వీరి అవసరాలను తీర్చేందుకు రైల్వే శాఖ నాన్ ఏసీ, జనరల్ కేటగిరీ రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తుంది. తక్కువ ఆదాయం కలిగిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు సాధారణ బోగీల్లో ప్రయాణం చేస్తారు.
అయితే పండగ సీజన్లలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది భారతీయ రైల్వే. అయితే సాధారణ ప్రజలకు ఆర్థిక స్థితిగతులతో ప్రతి రోజూ పండగే కాబట్టి నిత్యం ప్రత్యేక రైళ్లను నడపాల్సిన అవసరం ఉంది. ప్యాసింజర్ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వారి కోసం ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లను శాశ్వతం చేయాలని ప్రతిపాదించారు. గతంలో కోవిడ్ సమయంలో కార్మికులను వారి స్వస్థలాలకు వెళ్లేందుకు రైల్వే శాఖ ప్రత్యేక వలస రైళ్లను నడిపింది. ఇప్పుడు దీన్ని రెగ్యులర్ చేసే యోచనలో ఉంది. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, అస్సాం, పంజాబ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేక రైళ్లను నడపాలని భావిస్తున్నారు.
నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికులు, కార్మికులు, చేతి వృత్తుల వారు, ఇతర వర్గాల వారు చాలా మంది ఈ రాష్ట్రాల నుంచి నిత్యం పని కోసం మెట్రో నగరాలకు, పట్టణాలకు వెళ్తున్నారు. ఇలాంటి వారి కోసమే ప్రత్యేక రైళ్లను ప్రతి రోజూ నడపాలని భారతీయ రైల్వే యోచిస్తుంది. ఈ వలస ప్రత్యేక రైళ్లలో 22 నుంచి 26 బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ఒక సీజన్ కి పరిమితం చేయకుండా ఏడాది పొడవునా శాశ్వతంగా ఈ రైళ్లను నడపనున్నారు. ఈ రైళ్లను మిగతా రైళ్ళలానే రెగ్యులర్ సమయాల్లో నడపనున్నారు. కాబట్టి ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవచ్చు. మరోవైపు భారతీయ రైల్వేను భవిష్యత్తుకు అనుకూలంగా సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఎల్హెచ్బీ బోగీలు, వందే భారత్ బోగీలు.. ఈ రెండు బోగీలు మాత్రమే సర్వీసులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం సర్వీసులో 28 రకాల బోగీలు ఉన్నాయి.
ఈ సర్వీసులను రెండు సర్వీసులకు తగ్గించడం వల్ల రిపేర్ ఖర్చు తగ్గుతుందని.. అలానే ప్రయాణం చౌకగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఇక ఈ రైళ్లను జనవరి 2024 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త రైళ్లలో నాన్ ఏసీ ఎల్హెచ్బీ కోచ్ లు ఉంటాయి. వీటిలో జనరల్ కేటగితే, స్లీపర్ సర్వీసులు మాత్రమే ఉంటాయి. ఇందులో ఏసీ బోగీలు ఉండవు. ఆ ప్లేస్ లో సాధారణ, స్లీపర్ బోగీలు ఉంటాయి. అయితే ఈ రైళ్లకు ఇంకా ఏం పేరు నిర్ణయించలేదు. ఈ రైళ్లు వస్తే కనుక అటు కార్మికులు, కూలి పనులు చేసుకునే వారి సమస్యలు తీరతాయి, ఇటు సామాన్యుల సమస్యలూ తీరతాయి. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.