కరెన్సీ నోట్ల మీద బోసి నవ్వుల బాపూ మహాత్మాగాంధీ చిత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే అని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొంతమంది గాంధీ బొమ్మను తొలగించి.. ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి నాయకుల చిత్రాలను పెట్టాలని పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ ముని మనవడు కూడా కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మను తొలగించాలని కోరారు. గాంధీ చిత్రాన్ని తొలగించమని గాంధీ కుటుంబానికి సంబంధం లేని జనమే అనరు. అలాంటిది గాంధీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి.. స్వయానా గాంధీ ముని మనవడు అయి ఉండి ఆయన చిత్రాన్ని నోట్ల మీద తొలగించాలని కోరడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
డిసెంబర్ నెల ప్రారంభంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో డిజిటల్ రూపీకి సంబంధించి మొదటి పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆర్బీఐ భౌతిక నగదు నుంచి డిజిటల్ రూపీ/కరెన్సీ/ఈ-రూపీకి మార్చాలని చూస్తుంది. కాలక్రమేణా భౌతిక నగదుని పూర్తిగా కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ యుగం, పైగా ముద్రణకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకోసం ఆర్బీఐ ఇలా ఆలోచిస్తుంది. అయితే ఆర్బీఐ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ రూపీ మీద గాంధీ బొమ్మ లేకపోవడం గాంధీ కుటుంబానికి ఆగ్రహం తెప్పించింది. గాంధీ ముని మనవడు అయిన తుషార్ గాంధీ (తుషార్ అరుణ్ గాంధీ) కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ చిత్రాన్ని తొలగించమంటూ ట్వీట్ చేశారు.
కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ కరెన్సీ మీద మహాత్మాగాంధీ చిత్రాన్ని పెట్టలేనందుకు ఆర్బీఐ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. దయచేసి ఇప్పుడు పేపర్ కరెన్సీ నోట్ల మీద కూడా గాంధీ చిత్రాన్ని తొలగించండి’ అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ ట్వీట్ పై కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. దాదాపు నెటిజన్లు ప్రతికూలంగా స్పందిస్తున్నారు. ‘గతంలో జీవించడం మానేయండి. అతని వారసత్వాన్ని దోపిడీ చేయడానికి చూడకండి. మీ సొంతంగా ఏదో ఒకటి చేయండి. దేశం అనేది ఒక వ్యక్తి కంటే పెద్దది. మనం బేలూరు, హళేబీడు, కోణార్క్ మొదలైన వాటిని కరెన్సీపై చిహ్నాలుగా ఉంచుకోవాలి మరియు గులామీ ఆలోచనను ఆపాలి’ అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
‘కరెన్సీ నోట్ల మీద గాంధీ బొమ్మే కాదు, అసలు కరెన్సీ నోట్లే కనబడవు. ఎందుకంటే డిజిటల్ కరెన్సీ పూర్తిగా అందుబాటులోకి తెచ్చేది, భౌతిక నగదుని నిలిపివేయడానికే. ఈ మాత్రం దానికి గాంధీ బొమ్మని కూడా తొలగించండి అని ప్రత్యేకంగా చెప్పాలా? కొన్ని రోజులైతే ఎలాగూ కరెన్సీ నోట్లు కనబడవు, ఇక గాంధీ బొమ్మ ఎలా కనబడుతుంది? మీ ఆవేదనలో అర్థం లేదు’ అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం, ఆర్బీఐ డిజిటల్ కరెన్సీ మీద గాంధీ చిత్రాన్ని పెట్టకపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? గాంధీ బొమ్మ కరెన్సీ మీద ఉంటేనే ఆయన విలువ ఉంటుందా? లేకపోవడం వల్ల ఆయన విలువ ఏమైనా తగ్గిపోతుందా? మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
Thank you RBI and GoI for not including Bapu’s image on the newly introduce Digital Currency. Now please remove his image from paper money too.
— Tushar (@TusharG) December 26, 2022