కూతురు, కోడలు.. కూతురు కోడలికి అంటే సోదరుడి భార్యకు అర్థ భర్త అని అంటారు. కాబట్టి ఆ కూతురు కూడా కోడలిని శాసించేలా ప్రవర్తిస్తుంటుంది. ఇది అందరి ఇండ్లలో ఉండవు. ఎక్కడో కొన్ని చోట్ల ఉంటుంది. కూతురు, కోడలు అనే ఈ ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధృవాల్లాంటివారు. ఎదురుపడితే పాము, ముంగీసల్లా ఉంటారు. కొంతమంది మాత్రం అక్కా, చెల్లెళ్లలా కలిసి మెలిసి ఉంటారు. వాళ్ళ విషయం పక్కన పెడితే.. అత్తగారికి తన కోడలు ప్రధానమా? కూతురు ప్రధానమా? అనేది తేల్చాల్సిన విషయమే అని.. అటు కోడళ్ళు, ఇటు కూతుర్లు లోలోపల మదనపడుతుంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ప్రధానం అని ఒక చట్టం వస్తే బాగుణ్ణు అని అనుకుంటారు.
తన భర్త సొమ్ము కూతురికి పెట్టేస్తుందేమో అని కోడలు పిల్ల.. కోడలి ఇంట్లో వాళ్లకి తన అన్న సొమ్ము పెట్టేస్తుందని కూతురు పిల్ల, ఇలా ఇద్దరూ అనుమానాలతో జీవిస్తుంటారు. ఇలాంటి సమయంలో అత్తగారు కోడలికి ప్రాధాన్యత ఇవ్వాలా? కూతురుకి ప్రాధాన్యత ఇవ్వాలా? ఈ ఇద్దరిలో ఎవరు ప్రధానం అనే దాని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. చాలా మందికి కన్న కూతురి మీదే ప్రేమ ఉంటుంది కాబట్టి కోడలి కంటే కూతురికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ శాస్త్రం మాత్రం కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలని చెబుతోంది. ఎందుకంటే దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కోడలు అంటే ఇంట్లో దీపం వెలిగించే అమ్మాయి. ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు.
కూతురు కూడా దీపం వెలిగిస్తుంది. కానీ ఆమె ఎప్పటికైనా మెట్టినింటికి వెళ్లాల్సిన అమ్మాయే కాబట్టి కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలని శాస్త్రం చెబుతోంది. తన ఇంటి పేరుని మార్చుకుని మరీ కొత్త ఇంట్లో అడుగుపెడుతుంది. ఇంటి పేరునే కాకుండా, ఇంట్లో అందరి పేర్లను నిలబెట్టేందుకు కృషి చేస్తుంది. పుట్టింట్లో రాణిలా బతికినా.. మెట్టినింట్లో సేవకురాలిగా పని చేస్తుంది. పనిమనిషిలా, మన మనిషి అనేలా నడుచుకుంటుంది. మెట్టినింటి వారి కోసం తన ప్రపంచాన్ని వదులుకుని వచ్చే త్యాగశీలి కోడలు. కన్న తల్లిదండ్రులు ఎంతటి ఉన్నతులైనా గానీ మెట్టింటి వారి పట్ల ఉన్నత భావాలను కలిగి ఉండే గుణశీలి కోడలు. మెట్టినింటి గౌరవాన్ని కాపాడే బాధ్యతను తన భుజాన వేసుకున్న గుణవంతురాలు కోడలు.
తండ్రి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టే స్థోమత ఉన్నప్పటికీ.. భర్త పెట్టే పచ్చడి మెతుకులనే పంచభక్ష్య పరమాన్నాలుగా భావించే భాగ్యశీలి కోడలు. అత్త, మామలకు తల్లి అవుతుంది. భర్తకు భాగస్వామి అవుతుంది. బాధలను పంచుకుంటుంది. కోడలు కుడి కాలు పెట్టి ఇంట్లో అడుగుపెట్టగానే తన తల్లే కోడలి రూపంలో వచ్చిందని మురిసిపోతాడు మావయ్య. ఎందుకంటే అందరికీ అన్నం వండి పెట్టే అమ్మ తనే కదా. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృ దేవతల కోసం నాంది శ్రాద్ధము పెట్టి, కుటుంబాన్ని ఉద్ధరించే సమర్ధురాలిని కోడలిగా ఎంచుకున్నానని గర్వంగా భావిస్తాడు మామయ్య. ఆమె వస్తే కుటుంబానికి ఒక వెలుగు వచ్చినట్లు భావిస్తాడు.
కోడలు అంటే కట్టుకున్న భర్త కోసం, భర్తను కన్నవారి కోసం అన్నీ వదులుకుని మెట్టినింట్లో అడుగుపెడుతుంది. కాబట్టి ఆమె వదులుకున్నవన్నీ ఆమెకు తిరిగి ఏదో ఒక రూపంలో మెట్టినింటి వారు ఇవ్వాలి. అమ్మ, నాన్నలను వదిలి వచ్చినందుకు అత్త, మామలే అమ్మ, నాన్న అవ్వాలి. తను అన్నీ వదులుకుని వస్తుంది కాబట్టి కూతురు కంటే కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి. అదే ధర్మం. కూతురికి ప్రాధాన్యత ఇవ్వకపోయినా.. తను ఎలాగూ అత్తారింటికి వెళ్తుంది కాబట్టి.. ఆ గౌరవ, మర్యాదలు అక్కడ లభిస్తాయి. ప్రతీ కూతురికి తల్లి ప్రాధాన్యత ఇవ్వడం కంటే.. అత్తే తల్లి అయ్యి ప్రాధాన్యత, గౌరవ, మర్యాదలు ఇస్తే రెండు కుటుంబాలు బాగుంటాయి.
అంచేత ఎవరో ఒకరి ఇంటికి కోడలిగా వెళ్లిన కూతురి కంటే మన ఇంటికి కోడలిగా అడుగుపెట్టిన వేరొకరి కూతుర్ని కూతురిగా స్వీకరిస్తే.. ఆ ఇంట్లో అడుగుపెట్టిన సొంత కూతురు కోడలిగా కాకుండా కూతురిగా స్వీకరించబడుతుంది. లాజిక్ ప్రకారం చూసినా కూతురు ఎప్పటికైనా కోడలు అవుతుంది కాబట్టి.. కోడలికే ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయం ఇంగిత జ్ఞానం మనకు తెలియజేస్తుంది. కాబట్టి కూతురు గొప్పా? కోడలు గొప్పా? అంటే కూతురు కోడలు అవ్వడం గొప్ప. ఎవరో ఏంటో తెలియని ఇంట్లో అడుగుపెట్టి.. సర్దుకుపోయి బతకడం గొప్ప. కోడలు అయినప్పటికీ కూతురిలా అత్త, మామలను కంటికి రెప్పలా చూసుకోవడం గొప్ప. అత్త, మామలకు తల్లి అవ్వడం గొప్ప. మరి ఈ విషయంలో మీరేమంటారు? మీరు మీ కోడలిని కూతురిలా చూసుకుంటున్నారా? మీరు కూతురికి ప్రాధాన్యత ఇస్తారా? కోడలికి ప్రాధాన్యత ఇస్తారా? మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.