తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఆ కుటుంబం విలవిలలాడిపోయింది. కన్న తల్లే స్వయంగా తలకొరివి పెట్టింది. కన్న కొడుక్కు తలకొరివి పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎదురవడంతో వెక్కి వెక్కి ఏడ్చింది.
సృష్టికి జీవం అమ్మ. ఎన్ని జన్మలెత్తినా కన్న తల్లి రుణం తీర్చుకోలేనిది. తొమ్మిది నెలలు మోసి, పురిటి నొప్పుల బాధ భరించి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తాను పస్తులుండి కూడా బిడ్డల కుడుపునింపుతుంది. బిడ్డకు ఏ ఆపద వచ్చినా అల్లాడిపోతుంటుంది అమ్మ. అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఎన్నో కలలు కంటుంది. అలాంటి తల్లికి ఏ తల్లికి రాకూడని కష్టం వచ్చింది. విధి ఆడిన వింత నాటకంలో చెట్టంత కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోగా దుఖాన్ని దిగమింగుకుని తలకొరివిపెట్టింది. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తన చేతనే తలకొరివి పెట్టాల్సి రావడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. వృద్ధాప్య దశలో ఉన్న తల్లి కన్న కొడుక్కు తలకొరివి పెట్టిన ఘటన ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసింది.
తల్లిదండ్రలు తమ పిల్లలను ఏ కష్టం రాకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వృద్ధాప్యంలో తమకు అండగా ఉంటారని, చనిపోతే తలకొరివి పెట్టి కర్మకాండలు చేసి పున్నామ నరకం నుంచి తప్పిస్తారని కొడుకులపై గంపెడాశలు పెట్టుకుంటారు. కానీ ఆ తల్లి బువ్వ పెట్టి బుజ్జగించి లాలించి పెంచిన ఆ చేతులతోనే తలకొరివి పెట్టింది. అనారోగ్యంతో కన్న కొడకు మృతిచెందగా అన్నీ తానై అంత్యక్రియలు నిర్వహించింది. కన్నీళ్లు పెట్టించే ఈ ఘటన ఏపీలోని కృష్ణ జిల్లాలో చోటుచేసుకుంది. తలకొరివి పెట్టిన ఆ తల్లిని చూసి గ్రామస్తులు కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పామర్తి ఝాన్సీ కొడుకు పామర్తి ప్రసాద్. అతడు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఎన్ని ఆసుపత్రులు తిప్పినా ఫలితం లేకుండా పోయింది. కాగా ప్రసాద్ మృతిచెందాడు. కాగా ఇతనికి ఇద్దరు కుతుర్లున్నారు. అయితే అతడికి మగ సంతానం లేకపోవడంతో కన్నతల్లే తలకొరివి పెట్టే బాధ్యతను తీసుకుంది. తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఏ తల్లికి ఇలా జరగకూడదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. కొడుకును తలుచుకుని పామర్తి ఝాన్సీ కంటతడి పెట్టడం అందరినీ కలిచివేసింది.