మొబైల్ నెట్ వర్క్ సమస్య అనేది తెలియని యూజర్లు ఉండరేమో? ఎప్పుడైతే మీకు అవసరం వస్తుందో.. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అవుతుందో అలాంటి సమయాల్లోనే మీ ఫోన్ నెట్ వర్క పనిచేయకుండా పోతుంది. అయితే క్వాల్కమ్ కంపెనీ తీసుకొచ్చే శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ మీకు అలాంటి సమయాల్లో అక్కరకు వస్తుందని చెబుతున్నారు.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు అని.. దానికి నెట్ వర్క్ శాటిలైట్ నుంచి వస్తుందని చెప్పారు. ఆ వార్త వైరల్ అయిన తర్వాత అందరూ శాటిలైట్ కనెక్టివిటీ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయారు. సినిమాల్లో శాటిలైట్ ఫోన్లు చూపించిన విధంగా తమ ఫోన్లు కూడా శాటిలైట్ ద్వారా పనిచేస్తాయా అని సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. అయితే టెస్లా ఫోన్ ఎప్పుడొస్తుంది? నిజంగానే సాటిలైట్ ద్వారా పని చేస్తుందా? అనే విషయాలు పక్కన పెడితే ఇప్పుడు మరో కంపెనీ శాటిలైట్ కనెక్టివిటీని తీసుకొస్తోంది. అందుకోసం పలు కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. మరి అందులో మీ ఫోన్ ఉందో లేదో చూడండి.
అసలు ఏంటి ఈ శాటిలైట్ కనెక్టివిటీ? అంటే.. సాధారణంగా మీరు వాడే మొబైల్ నెట్ వర్క్ తరహాలోనే ఈ శాటిలైట్ కనెక్టివిటీ కూడా పని చేస్తుంది. అయితే ఒక తేడా ఉంది. అదేంటంటే.. టవర్ సాయంతో పనిచేసే ఫోన్ నెట్ వర్కులు ఒకానొక ప్రాతంలో పనిచేయడం మానేస్తాయి. సిగ్నల్ అందకపోతే ఆ మొబైల్ నెట్ వర్క్ తో ఉపయోగం ఉండదు. గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో ఫోన్లు ఉన్నా నెట్ వర్క్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ శాటిలైట్ నెట్ వర్క్ తో అలాంటి ఇబ్బందులు ఉండవు. కొన్ని కంపెనీలు ఈ శాటిలైట్ నెట్ వర్క్ తో బ్రాడ్ బాండ్ సేవలు కూడా అందించే యోచనలో ఉన్నాయి.
క్వాల్కమ్ కంపెనీ స్నాప్ డ్రాగన్ శాటిలైట్ పేరిట శాటిలైట్ కనెక్టివిటీని విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన కన్జూమర్ టెక్నాలజీ అసోసియేషన్(సీఈఎస్)లో క్వాల్కమ్ ఈ శాటిలైట్ కనెక్టివిటీ సర్వీస్ గురించి ప్రకటించింది. అతి త్వరలోనే కొన్ని కంపెనీ ఫోన్లకు ఈ స్నాప్ డ్రాగన్ శాటిలైట్ సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తామంటూ చెప్పుకొచ్చారు. తాజాగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఏఏ కంపెనీ ఫోన్లలో ఈ శాటిలైట్ కనెక్టివిటీని మొదట తీసుకురాబోతున్నారు అనే అంశాన్ని ప్రకటించారు. షావోమీ, ఒప్పో, వివో, మోటరోలా, నథింగ్, హానర్ ఫోన్లలో ఈ శాటిలైట్ కనెక్టివిటీని మొదట విడుదల చేస్తామన్నారు.
స్నాప్ డ్రాగన్ శాటిలైట్ ద్వారా ఈ కనెక్టివిటీ జరుగుతుంది. ఇది టూవే మెసేజింగ్ సర్వీస్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా తమ సేవలను అందించనున్నారు. ఈ సర్వీస్ థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్స్ ని కూడా సపోర్ట్ చేస్తుంది. యాపిల్ 14లో ఈ శాటిలైట్ కనెక్టివిటీని తీసుకొచ్చారు. కానీ, యాపిల్ థర్డ్ పార్టీ యాప్స్ ని సపోర్ట్ చేయలేదు. అందుకనే క్వాల్కమ్ కంపెనీ ఇప్పుడు గ్లోబల్ శాటిలైట్ కమ్యునికేషన్స్ ఇరీడియమ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. స్నాప్ డ్రాగన్ 5జీ మోడెమ్- ఆర్ఎఫ్ సిస్టమ్స్, ఇరీడియమ్ శాటిలైట్ కన్సల్టేషన్ సాయంతో స్నాప్ డ్రాగగన్ శాటిలైట్ పనిచేస్తుంది. ఈ విషయంపై క్వాల్కమ్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. “నెక్ట్స్ జనరేషన్ డివైసెస్ లోకి స్నాప్ డ్రాగన్ శాటిలైట్ సర్వీసెస్ ని తీసుకురాబోతుండటం సంతోషంగా ఉంది. ఈ సర్వీస్ సాయంతో మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎమర్జెన్సీ సమయాల్లో సందేశాలు పంపడం, కమ్యూనికేట్ అయ్యే అవకాశం ఉంటుంది” అంటూ ఫ్రాన్సెస్కో గ్రిల్లి వ్యాఖ్యానించారు.
క్వాల్కమ్ కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే కాకుండా.. ల్యాప్ టాప్స్, ట్యాబ్లెట్స్, వాహనాలు, ఐఓటీ ఎనేబుల్డ్ డివైసెస్ కి ఈ శాటిలైట్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎప్పటి నుంచి ఈ స్నాప్ డ్రాగన్ శాటిలైట్ సర్వీసెస్ వాడుకోగలరు? అనే వాటిపై మాత్రం ఎలాంటి తేదీ, సమయాన్ని ప్రస్తావించలేదు. ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు అనే విషయాన్ని వెల్లడించలేదు. క్వాల్కమ్ తీసుకొస్తున్న ఈ శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగకరమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.