కరోనా మహమ్మారి కారణంగా ఆన్ లైన్ లోనే పనులను, నగదు లావాదేవీలను జరపాల్సి వస్తుంది. ముఖ్యంగా దేశమంతా ఆన్ లైన్ నే నమ్ముకునే సరికి.. ఇదే అదనుగా ఆన్ లైన్ మోసాలు కూడా ఊపందుకుంటున్నాయి. పనులన్నీ ఆన్ లైన్ అయ్యేసరికి జరిగే మోసాలను కూడా గుర్తించలేకపోతున్నారు జనాలు. కేవలం లాక్ డౌన్ సమయంలోనే లక్షల్లో ఆన్ లైన్ మోసాలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రభుత్వాలతో పాటు సదరు ఆన్ లైన్ కంపెనీలు సైతం ఫోన్ పట్టుకునే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేశాయి. కానీ ఎంత జాగ్రత్తపడినా జరిగే మోసాలు ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారు కూడా జాగ్రత్తపడుతూ చోటు మార్చుతున్నారు.. కానీ మోసాలను మాత్రం ఆపడం లేదు.
ఈ మధ్యకాలంలో KYC Verification పేరిట పెద్ద ఎత్తున SMS స్కాములు జరుగుతున్నాయి. ఈ SMS స్కామ్ లో చాలా ఈజీగా చిక్కుకుంటారు సామాన్యులు. ఎలాగంటే.. ఈ మెసేజ్ కు రెస్పాండ్ అవ్వకపోతే మీ నంబర్ 24 గంటల్లో బ్లాక్ అవుతుందని హెచ్చరిక వస్తుంది. ఇండియాలో బిగ్గెస్ట్ నెట్ వర్క్స్ Airtel, Idea, Jio, Vodafone లతో పాటు అన్ని నెట్ వర్కుల వినియోగదారులు.. ఈ KYC పేరిట నకిలీ SMSల ముసుగులో మోసపోతున్నారు. చాలామంది బాధితులు కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు.
ఉదాహరణకు Airtel కస్టమర్లకు 9114204378 నంబర్ నుండి 0 అనే మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేయగానే, ‘డియర్ ఎయిర్టెల్ కస్టమర్, ఈ రోజు మీ సిమ్ సేవలు నిలిపివేయబడతాయి. మీ SIM కార్డును వెంటనే అప్డేట్ చేసుకోండి.. అందుకోసం వెంటనే 8582845285 నెంబర్ కి కాల్ చేయండి’ అంటూ సందేశం ఉంటుంది. అదీగాక వెంటనే సంప్రదించకపొతే సిమ్ బ్లాక్ అవుతుందని చూపించడం గమనార్హం.
ఇలాంటి మేసేజులు పంపి వినియోగదారుల దృష్టిని మరల్చి, రెస్పాండ్ అవ్వగానే తెలివిగా వివరాలను రాబట్టి వారి బ్యాంకుల నుండి డబ్బును విత్ డ్రా చేయడం జరుగుతోంది. అందుకే ఆన్ లైన్ పనులు, నగదు లావాదేవీల విషయాల్లో ఎక్కువ జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆన్ లైన్ మోసాలకు ముఖ్య కారణం OTP షేర్ చేయడం. మీ మొబైల్ కి వచ్చే ఏ ఒక్క OTP ని ఇతరులకు షేర్ చేయకూడదు. ఇకనైనా ఆన్ లైన్ మోసాల నుండి జాగ్రత్త వహించండి. ఇక ఆన్ లైన్ మోసాల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.