గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వాట్సాప్ కాల్ వస్తే లిఫ్ట్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా కొంతమంది అత్యాశకు పోయి ఈజీ మనీ ట్రాప్ లో పడి కేటుగాళ్లతో కాంటాక్ట్ అవుతున్నారు. కట్ చేస్తే లక్షలు నష్టపోతున్నారు.
అత్యాశ ఉన్న చోట మోసం కూడా సంచరిస్తుంటుంది. ఆ సమయంలో మోసాన్ని అత్యాశ డామినేట్ చేస్తే ఏ మనిషైనా సరే మోసపోవాల్సిందే. ఆర్థికంగా నష్టపోవాల్సిందే. కష్టపడకుండా, బుర్ర పెట్టకుండా ఎవరో ఏదో చెప్తే నిమిషాల్లో, గంటల్లో డబ్బులు వచ్చేస్తాయని నమ్మి పెట్టుబడి పెడితే లక్షలు కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈజీ మనీ పేరుతో అమాయక ప్రజలను ట్రాప్ చేసి లక్షలు కాజేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ ట్రాప్ లో చదువులేని వారు పడ్డారంటే ఒక అర్థం ఉంది.. కానీ పెద్ద చదువులు చదువుకున్న వారు, సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసుకునేవారు కూడా పడిపోతున్నారు. చదువుకున్న వీళ్ళనే ఇంతలా మోసం చేయగలుగుతున్నారంటే చదువులేని అమాయకులను ఎంతలా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క వాట్సాప్ కాల్ వల్ల ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి రూ. 21 లక్షలు కోల్పోయాడు.
చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం కోలావూరుకు చెందిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఊర్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. ఆన్ లైన్ ద్వారా వస్తువులు ఆర్డర్ పెడితే ఎక్కువ కమిషన్ ఇస్తామని వాట్సాప్ కాల్ లో కేటుగాడు నమ్మించాడు. ఇది నిజమే కాబోలు అని రూ. 500 తో వస్తువు ఆర్డర్ చేశాడు. ఆ తర్వాత రూ. 15 వేలు పెట్టి వస్తువులు ఆర్డర్ చేశాడు. మొదటి దఫాగా రూ. 3 వేలతో ఆర్డర్ పెడితే రూ. 15 వేలు ఇచ్చాడు. ఇంకా నమ్మించడం కోసం కమిషన్ రూపంలో ఆ ఉద్యోగి ఖాతాలో డబ్బులు జమ చేస్తూ వచ్చారు. అత్యాశకు పోయిన ఉద్యోగి రూ. 21 లక్షల వరకూ డబ్బులు చెల్లించి వస్తువులు ఆర్డర్ చేశాడు.
ఉద్యోగి నుంచి ఎక్కువ డబ్బు జమ చేయించడం, తక్కువ మొత్తం కమిషన్ ఇవ్వడం ద్వారా నమ్మించి రూ. 21 లక్షలు కాజేశాడు. ఈ తతంగం 3 వారాల పాటు సాగింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఆన్ లైన్, సైబర్ మోసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఆన్ లైన్ గేమ్స్, ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ ని నమ్మొద్దని సూచిస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్ ని లిఫ్ట్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్లతో ఇక్కడి వారే వాట్సాప్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారని.. ఇలాంటి కాల్స్ పట్ల అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు.