సాధారణంగా స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ టెలిగ్రామ్ యాప్ ని వాడుతున్నారు. అయితే అందులో మెసేజ్ లు, పైరసీ సినిమాలు మాత్రమే కాదు.. స్కామ్ లు కూడా జరుగుతుంటాయి. మీరు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. మీ ఖాతాలు ఖాళీ అయిపోతాయి.
ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో పెరిగిందో.. మోసాలు కూడా అలాగే పెరిగాయి. ముఖ్యంగా ఆర్థిక మోసాలు చాలా ఎక్కువయ్యాయి. మోసగాళ్లు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పుడు పార్ట్ టైమ్ స్కామ్ ట్రెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. మనుషుల బలహీనతని ఆసరాగా చేసుకుని లక్షల్లో కాజేస్తున్నారు. ఎన్ని వార్తలు వస్తున్నా.. ప్రజలు కూడా గుడ్డిగా నమ్ముతూ కష్టపడి సంపాదించిన సొమ్ముని కేటుగాళ్లకు ముట్టజెబుతున్నారు. తాజాగా ఒక టెలిగ్రామ్ మోసం వెలుగు చూసింది. పార్ట్ టైమ్ జాబ్ పేరిట మొత్తం ఇద్దరు వ్యక్తులను మోసగించారు. వారి నుంచి ఏకంగా రూ.16 లక్షల వరకు కాజేశారు. చివరికి మోసపోయామని గ్రహించి బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం.. ఈ స్కామ్ పూణెలో జరిగింది. వాఘోలీ ప్రాంతానికి చెందిన 45 ఏళ్ల మోహన్ లాల్ ఈ స్కామ్ లో రూ.8.56 లక్షలు పోగొట్టుకున్నాడు. అతనికి టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ లో కొందరు పరిచయం అయ్యారు. అతనికి పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ చేశారు. అతను చేయాల్సింది ఏమీ లేదని.. కేవలం వచ్చిన లింక్స్ క్లిక్ చేయడం, చెప్పిన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పారు. అందుకు డబ్బు కూడా చెల్లిస్తామని వెల్లడించారు. అలాగే బోనస్ లు కూడా ఉంటాయని నమ్మించారు. కాకపోతే జాయినింగ్ పీజ్ కట్టాలని చెప్పారు. తర్వాత ఆ మొత్తాన్ని రిఫండ్ కూడా చేస్తామంటూ హామీ ఇచ్చారు.
వారి మాటలు నమ్మిన మోహన్ లాల్ వారికి జాయినింగ్ ఫీజు మాత్రమే కాదు.. వారు చెప్పిన టాస్కులు పూర్తి చేస్తూ.. కొంత కొంత మొత్తాన్ని వారి ఖాతాలకు ట్రాన్స్ ఫర్ కూడా చేయసాగాడు. అలా కొన్నాళ్ల తర్వాత అతని డబ్బు డ్రా చేసుకోవాలని ప్రయత్నించగా.. అతని యాక్సెస్ దొరకలేదు. అప్పటికే వివిధ ఖాతాలకు మోహన్ లాల్ రూ.8.56 లక్షలు ట్రాన్స్ ఫర్ చేశాడు. తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నిందితులు ఢిల్లీలోని పంజాబ్ భాగ్ కి చెందిన రియా శుక్లా, ప్రంజల్ సింఘాల్, మాన్వీ గోయల్, అవంతికా గులేరియాగా గుర్తించారు. ఇదే తరహాలో పూణేకి చెందిన మరో వ్యక్తి నుంచి 7.5 లక్షలు కాజేశారు. ఈ రెండు కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్ లకు ఆశపడి.. డబ్బు పోగొట్టుకోవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.