జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్ సీఏ) డైరెక్టర్ గా వీవీఎస్ లక్ష్మణ్ ను నియమించడం దాదాపు ఖరారైంది. ఎన్ సీఏ తదుపరి డైరెక్టర్ వీవీఎస్ నే అంటూ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సైతం ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. ఎన్ సీఏ కొత్త డైరెక్టర్ లక్ష్మణేనా అని అడిగిన ప్రశ్నకు ‘అవును’ అని సమాధానం ఇచ్చారు. లక్ష్మణ్ ఈ పదవి స్వీకరించనున్న నేపథ్యంలో హైదరాబాద్ మెంటర్ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధన కారణంగా లక్ష్మణ్ వ్యాఖ్యాతగా వ్వహరించడం.. పత్రికలకు కాలమ్స్ రాయడం కుదరదు. డిసెంబర్ 4న కోల్ కతాలో లక్ష్మణ్ కు బాధ్యతలను అప్పగించనున్నారు. సంవత్సరంలో ఎక్కవ రోజులు బెంగుళూరులో ఉండాల్సి ఉంటుందనే కారణంతో.. మొదట్లో లక్ష్మణ్ ఎన్ సీఏ డైరెక్టర్ పదవికి విముఖత చూపాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైన్ షాలు పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని ఒప్పుకున్నాడు.
వీవీఎస్ లక్ష్మణ్, ద్రావిడ్ ద్వయం అంటే వెంటనే గుర్తొచ్చేది 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్. ఆ టెస్టు మ్యాచ్ లో 281 పరుగుల ఇన్నింగ్స్ టెస్టు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే వాటిలో ఒకటి. ఆస్ట్రేలియా విసిరిన 445 పరుగుల సవాలును ఎదుర్కోలేక భారత్ మొదటి ఇన్నింగ్స్ 171 పరుగులకే కుప్పకూలింది. ఫాలోఆన్‌లో పడిన భారత్ ను లక్ష్మణ్ పోరాట పటిమతో ఓటమి నుంచి గెలుపు తీరాలకు చేర్చాడు. ఆ మ్యాచ్ లో 281 పరుగులు చేసి ఆద్వితీయమైన పోరాట పటిమను పదర్శించాడు లక్ష్మణ్.
లక్ష్మణ్ వీరోచితమైన ఇన్నింగ్స్ ఆడటానికి కారణం ద్రావిడ్ కూడా. ఇద్దరు సమన్వయంతో కష్టాల్లో ఉన్న భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. లక్ష్మణ్ కు జోడీగా అవతలి ఎండ్ లో ద్రావిడ్ లేకపోయి ఉంటే ఈ అద్భుత విజయం సాధ్యం కాకపోయేది. ఈ టెస్టు మ్యాచ్ లో వీరి జోడీ అయిదో వికెట్ కు 376 పరుగులు చేసింది. ద్రావిడ్ 180 పరుగుల చేసి లక్ష్మణ్ కు సహాకారం అందించాడు. ఆ మ్యాచ్ కెప్టెన్ గంగూలీనే.
ఇన్నేళ్ల తరువాత బీసీసీఐ నాయకుడిగా సౌరవ్ గంగూలీ సారథ్యంలో భారత్ కోచ్ గా ద్రావిడ్.. ఎన్ సీఏ డైరెక్టర్ బాధ్యతలు లక్ష్మణ్ కు అప్పగించనున్నారు. ఆ జోడి మీద ఉన్న నమ్మకంతోనే భారత్ జట్టును వారి చేతుల్లో పెట్టారు దాదా. లక్ష్మణ్, ద్రావిడ్ ద్వయం విజయవంతం కావాలని. టీమ్ ఇండియాను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లాలని, ప్రతిభావంతులను భారత్ జట్టుకు అందించాలన్నది ప్రతి క్రికెట్ అభిమాని కోరిక.