కాంగ్రెస్ పార్టీలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దాంతో మరి కొందరు కాంగ్రెస్ కీలక నేతలు కూడా కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు.. వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా వరంగల్‌లో ఆ పార్టీ కీలక నేతలైన కొండా దంపతులు కాంగ్రెస్‌ను వీడి.. బీజేపీలో చేరతారంటూ రెండు మూడు రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ పుకార్లకు కొండా దంపతులు చెక్ పెట్టారు. తమకు పాఈర్ట మారే ఆలోచన లేదని ఈ సందర్భంగా కొండా మురళి స్పష్టం చేశారు. అంతేకాక రానున్న ఎన్నికల్లో.. వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖ పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కొండా దంపతులు.. మంగళవారం హనుమకొండ రాంనగర్‌లోని తన నివాసంలో వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. తాము బీజేపీలో చేరనున్నట్లు కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కానీ తాము కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు. అంతేకాక.. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఎర్రబెల్లి దయాకర్ రావుపై పాలకుర్తిలో పోటీ చేస్తానని సవాల్ చేశారు. అలానే కొండా సురేఖ వరంగల్ తూర్పు నుంచి పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే దయాకర్ రావు సోదరుడు టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాడని.. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని.. అప్పుడు దయాకర్ రావు టీఆర్‌ఎస్, ఆయన అల్లుడు కాంగ్రెస్, సోదరుడు బీజేపీ ఇలా ఒక్క ఇంట్లోనే మూడు పార్టీలు ఉంటాయని కొండా మురళి ఎద్దేవా చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.