ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇటు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా.. ఏపీ రాజకీయాల్లో నెల్లూరు నేతలు కీలకంగా వ్యవహరించారు. పార్టీలతో సంబంధం లేకుండా.. నెల్లూరు జిల్లా నేతలు.. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం ఫ్యామిలీ, నేదురమల్లి కుటుంబం. కండువాలు, జెండాలు మారినా.. ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు ఆనం బ్రదర్స్ వర్సెస్ నేదురుమల్లిగా ఉండగా.. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డి వర్సెస్ రామ్ కుమార్ రెడ్డిగా మారింది. తాజాగా ఈ వారసత్వ పోరు మరింత పెరిగింది. ఇక గత కొంత కాలంగా.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి వైసీపీ ప్రభుత్వం షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలకు బదులుగా.. వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం స్థానంలో ఆ నియోజకవర్గం ఇన్చార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇటీవల నియమించింది. ఆనం వ్యాఖ్యలకు బదులుగా ఇలా చేసింది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక.. ఆనం పార్టీ సభ్యత్వంపై కూడా వేటు వేస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీలో కూడా ఆనంకు ప్రాధాన్యత తగ్గించారు. ఇక తాజాగా గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనవద్దని ఆనంని ఆదేశించినట్లు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. త్వరలోనే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారతారనంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.
త్వరలోనే ఆనం రామనారాయణ రెడ్డి.. వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరతారని.. రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆనం టీడీపీ నుంచి బరిలో దిగుతారని సమాచారం. టీడీపీలో చేరి ఆత్మకూరు నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన పోటీ చేయకుంటే ఆయన కుమార్తె కైవల్యా రెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఆనం రామనారాయణరెడ్డి.. టీడీపీతో మంతనాలు సాగించారని.. ఆనం కుటుంబానికి రెండు సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అంగీకరించాడని తెలుస్తోంది. అయితే ఆనం వెంటనే పార్టీ మారతారా.. లేక ఎన్నికల ముందు టీడీపీలో చేరతారా అనే దాని మీద సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఇదే జరిగితే.. సింహపురిలో మరోసారి ఆనం వర్సెస్ నేదురుమల్లి అంశం తెరమీదకు రాబోతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి నిజంగానే ఆనం.. టీడీపీలో చేరతారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.