ఏపీలో అధికార వైసీపీలో వర్గ పోరు రోజురోజుకు పెరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ప్రాంతీయ నాయకులు పెత్తనం చేయాలని చూస్తున్నారు. కొన్ని రోజుల క్రితం నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఈ వర్గపోరు తగలగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారట.
ప్రసుత్తం విశాఖ జిల్లా గిరిజన ప్రాంతం వైసీపీకి కంచుకోట. పాడేరు, అరకు నియోజకవర్గాలలో దశాబ్ద కాలంగా అధికార పార్టీదే హవా. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో భాగంగా అల్లూరి సీతారామారాజు కేంద్రంగా పాడేరు ఏర్పాటవుతుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాజకీయంగా సమీకరణాలు మారుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఇక్కడ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన భాగ్యలక్ష్మి విజయం సాధించారు. అయితే ఈ రెండున్నరేళ్ల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి వలసలు భారీగా పెరిగాయి. పాడేరులో ప్రతిపక్షానిది ప్రేక్షక పాత్రే. ఇక్కడ వైసీపీ ప్రజల ఆదరణ ఎక్కువగా ఉంది. వైసీపీకి కంచుకోటగా మారిన ఈప్రాంతంలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయని సమాచారం. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి ఎవరి రాజకీయం వారు చేస్తున్నారట.
ప్రస్తుతం పాడేరులో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, మత్స్యకార విశ్వేశ్వర రాజు గ్రూపులు బలంగా పని చేస్తున్నాయట. ఈ క్రమంలో ఎవరికి వారు తమ ఆధిక్యాన్ని ప్రదర్శించుకోవడానికి తాపత్రయ పడుతున్నారట. అధికార కార్యక్రమం అయినా.. పార్టీ వేడుక అయినా ఎవరకి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారట. ఇక భాగ్యలక్ష్మి, బుల్లిబాబు వర్గాల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందట పరిస్థితి.
ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు.. అరకు ఎంపీ మాధవి అనుచరుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంపీ కోటాలోనే ఆ పదవి లభించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా వీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. బుల్లిబాబు వర్గం తనతో కలిసి రాకపోగా.. గ్రూప్ పాలిటిక్స్ నడపడం ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి ఏమాత్రం నచ్చడం లేదట. బుల్లిబాబు కార్యకలాపాలన్ని పాడేరులోని ఎంపీ క్యాంప్ కార్యాలయం వేదికగా జరుగుతున్నాయనే అభిప్రాయం ఎమ్మెల్యే వర్గంలో ఉందట.
ఇక మరోవైపు మత్స్యరాజ విశ్వేశ్వర శర్మ గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. జెడ్పీ చైర్ పర్సన్ అవకాశంం కోసం ఆశించి భంగపడ్డారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విశ్వేశ్వర శర్మ భావిస్తున్నారట. ఈ క్రమంలో పార్టీ హైకమాండ్ విశ్వేశ్వర శర్మకు ఎస్టీ కమిషన్ సభ్యుడిగా నియమించింది. ఈ పరిణామంతో పాడేరు పాలిటిక్స్ మరింత వేడెక్కుతాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితికి భాగ్యల్మక్ష్మి కోటరీనే కారణంగా చూపిస్తున్నారు ప్రత్యర్థులు. గత ఎన్నికల సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేసిన సీనియర్లను ఎమ్మెల్యే పక్కకు పెట్టారట. ఈ అసంతృప్తి రోజురోజుకు పెరిగి భాగ్యలక్ష్మికి స్వపక్షంలోనే ధిక్కారం తప్పడం లేదట.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే వైఖరి వల్లే ఓడిపోయామని పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారట. ఎమ్మెల్యే వైఖరి కారణంగా గిరిజన ఉపకులాలకు అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి జడ్పీటీసీ, ఎంపీపీ అభ్యర్థుల ఎంపికే నిదర్శనం అంటున్నారు. ఈ విమర్శలపై ఎమ్మెల్యే వర్గం స్పందించడంతో ఆ వివాదం మరింత ముదిరింది. గ్రూప్ రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు భాగ్యలక్ష్మి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదట. తాజాగా ప్రత్యర్థి వర్గం ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు సిద్ధం అయ్యిందట. ఈ క్రమంలో ఎమ్మెల్యే స్థానంలో ఓ కోఆర్డినేటర్ ని నియమించాలని అధిష్టానాన్ని కోరుతున్నారట.
ఈ పరిణామాలతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అలర్ట్ అయ్యారట. పాడేరులో పరిస్థితులును అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారట. వ్యక్తిగతంగా తనకు, పార్టీకి నష్టం చేకూర్చేవారిని కట్టడి చేయమని కోరాలని భావిస్తున్నా.., ముఖ్య నేతలు మాత్రం ఆమెకు అప్పాయింట్ మెంట్ ఇవ్వడం లేదని సమాచారం. సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోతే ఎలా అని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇది ఇలానే కొనసాగితే.. ఇక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఒక్కటే దారి అని అంటున్నారట. మరి ఈ సమస్యను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి అంటున్నారు కార్యకర్తలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.