టీడీపీ కీలక నేతల్లో గల్లా జయదేవ్ ఒకరు. గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి 2 సార్లు టీడీపీ తరపున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో విజయం తరువాత.. పార్లమెంట్‌లో కూడా పార్టీ తరఫున బలంగా తన వాదనలు వినిపించేవారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పటికి.. గల్లా జయదేవ్ మాత్రం గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అయినా పార్టీకి ఆయన వల్ల పెద్దగా ప్రయోజనం లేదనే టాక్ టీడీపీలో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. రెండుసార్లు విజయం సాధించినప్పటికి కూడా ఆయన నియోజకవర్గంలో పెద్దగా పర్యటించరు. కేడర్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండరు. వ్యక్తిగత విదేశీ పర్యటనలు, వ్యాపారాలను చూసుకోవడంతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారు తప్ప పార్టీ గురించి నియోజక వర్గం గురించి ఆలోచించరనే ఫిర్యాదు మొదటి నుంచి ఉంది. ఇప్పటికే పార్టీ హైకమాండ్‌కు, గల్లాకు మధ్య చాలా గ్యాప్ వచ్చిందని.. ఆయన టీడీపీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీలో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్రను గమనిస్తే.. ఈ వార్తలు నిజమే అనిపిస్తున్నాయి.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు మరోసారి పాదయాత్ర ప్రారంభించారు. దీనికి దేశవిదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. రాజధాని అమరావతి ప్రాంతం ఎక్కువగా గుంటూరు జిల్లా పరిధిలో వుంది. ఈ క్రమంలో రాజధాని ఉద్యమానికి గుంటూరు జిల్లా టీడీపీ నేతలు గట్టి మద్దతుదారులుగా నిలిచి వుండాలి.. ఉంటారని ఎవరైనా భావిస్తారు. కానీ టీడీపీ సీనియర్ నాయకుడు, గుంటూరు లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మాత్రం ఈ పాదయాత్ర దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.
ఈ పాదయాత్ర వెనక ఉన్నది టీడీపీ అని అందరికి తెలుసు. అలాంటిది రాజధాని ప్రాంతం నుంచి, అది కూడా తెలుగుదేశం తరపున లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న గల్లా జయదేవ్ పాదయాత్రకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. దాంతో ఆయన పార్టీకి దూరం కానున్నారనే వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పాదయాత్రనే కాదు, అసలు గత కొంత కాలంగా ఆయన టీడీపీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది.
అంతేకాక గత కొంత కాలం నుంచి గల్లా జయదేవ్ అధికార పార్టీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని, వైసీపీలో చేరే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో జయదేవ్ అమరావతి పాదయాత్రకు కూడా దూరంగా ఉండటంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లు అవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.