Gudivada Amarnath: టీడీపీ ముసుగులో జరుగుతున్న అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రలోని బ్యాక్ వర్డ్ క్లాస్ కి అమరావతి బిజినెస్ క్లాస్ కి మధ్య జరుగుతున్న పోరాటమని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. చంద్రబాబు తన వాళ్ళ ప్రయోజనాల కోసం అమరావతి పేరుతో ఉత్తరాంధ్రను ఉత్త ఆంధ్రాగా మార్చాలనే కుట్ర చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. మంగళవారం గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచన. కానీ, టీడీపీ మహా పాదయాత్ర పేరుతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోంది.
చంద్రబాబు ఉత్తరాంధ్ర ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కుట్ర చేస్తున్నారు. అక్కడ ఎలాంటి గొడవలైనా జరిగి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చంద్రబాబుదే బాధ్యత. పాదయాత్ర పేరుతో దండయాత్ర చేస్తే జనం చూస్తూ ఉరుకోరు. కేవలం పెట్టుబడి దారుల కోసమే ఈ పాదయాత్ర సాగుతోంది. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతాం. 44 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి ఏం మేలు చేశారు.
1983 నుంచి జరిగిన వివిధ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు అండగా నిలిచారు. అటువంటి ఈ ప్రాంతానికి చంద్రబాబు ఎందుకు ద్రోహం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబుతో కలిసి మిగిలిన పార్టీలు చేస్తున్న కుట్రలను కూడా ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు మోసగాడు అని తెలిసి కూడా ఈ పార్టీల నాయకులందరూ ఆయన ముందు ఎందుకు సాగిల పడుతున్నారు’’ అని ప్రశ్నించారు. మరి, అమరావతి రైతుల పాదయాత్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Buddha Venkanna: టీడీపీ నేత బుద్ధా వెంకన్న కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరు?