మన దేశంలో రాజకీయాల్లో, సినిమాల్లో రాణించాలంటే.. బలమైన బ్యాగ్రౌండ్ ఉండాలనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది. అంతేకాక రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నవారితో పోలిస్తే సామాన్యులు రాజకీయాల్లో రాణించడం అంత సులభం ఏం కాదు. ఇది అందరికి తెలిసిన సంగతే. మహా అయితే ఎమ్మెల్యేగానే, ఎంపీగానో గెలవవచ్చు. కానీ ఏకంగా ఓ పార్టీ స్థాపించి.. దాన్ని అధికారంలోకి తీసుకువచ్చి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అంటే పగటికలగానే భావిస్తారు. అయితే ఈ ఆలోచనా ధోరణిని బద్దలు కొట్టారు అరవింద్ కేజ్రీవాల్.
భారతీయ రెవెన్యూ అధికారిగా పని చేశారు. తరువాత రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి.. దేశ రాజధాని ఢిల్లీకి సీఎం అయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. పంజాబ్ లో కూడా పాగా వేసింది. కాంగ్రెస్ కు బలమైన కంచుకోటగా ఉన్న పంజాబ్ లో ఆప్ విజయకేతనం ఎగురవేసింది. ఆప్ లాంటి ఓ ప్రాంతీయ పార్టీ బలమైన జాతీయ పార్టీలను ఓడించడం సంచలనంగా మారింది. మరి పంజాబ్‌లో ఆప్ కు కలసివచ్చిన అంశాలు.. కాంగ్రెస్ ఓటమికి కారణాలు ఏంటో చూద్దాం.
1.ఢిల్లీలో ఆప్ పాలన చూసి…
ఐఆర్‌ఎస్ పదవిని త్యజించి రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్.. దేశ రాజధానిని అసలుసిసలు అభివృద్ధి సూచికగా మారుస్తున్నారు. ప్రజల కనీస అవసరాలైన చదవు, వైద్యం వంటి విషయాల్లో కేజ్రీవాల్ తీసుకువచ్చిన సంస్కరణలు చరిత్రలో నిలిచిపోతాయి అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీ వాసులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు కాదని.. సర్కార్ బడులకు పంపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారంటే.. ఆ రంగాలను ఏవిధంగా అభివృద్ధి చేశారో అర్థం చేసుకోవచ్చు. పొరుగు రాష్ట్రం పంజాబ్ ప్రజలు ఇదే మార్పును కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ ను కాదని.. ఆప్ కు పట్టం కట్టారు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
2.కరోనా టైంలో స్పందించిన తీరు..
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో.. ప్రజలు మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు పెట్టారు. కానీ ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్.. ప్రభుత్వం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసి కరోనా బాధితులకు మంచి వైద్యం, పోషాకాహారం అందించారు. ఇంటింటికి వైద్య సిబ్బందిని పంపి టెస్ట్ లు నిర్వహించారు. కరోనా కట్టడికి అత్యుత్తమైన మార్గాలను అవలంభించారు. ఇదే పంజాబ్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. విపత్కర పరిస్థితుల్లో ఓ నాయకుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. కేజ్రీవాల్ అలానే చేశారని.. ఇదే ఆప్ కు కలిసి వచ్చింది అంటున్నారు.
ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్ లో BJP విజయానికి 10 కారణాలు
3.కుల, మతాలకు అతీతమైన రాజకీయం..
మన దేశంలో జాతీయ పార్టీలు మొదలు.. చిన్న, చిన్న ప్రాంతీయ పార్టీల వరకు ఎన్నో సమీకరణాలు వేసుకుని ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి. కులాలను, మతాలను తెరపైకి తెస్తాయి. కానీ కేజ్రీవాల్ మాత్రం.. వీటికి ఆమడదూరంలో ఉంటారు. అభివృద్ధే ఆయన పార్టీ అజెండా. ఇదే ప్రజల్లో ఆయనకు విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చి.. ఆప్‌ని గెలిపించింది.
4. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించిన కేజ్రీవాల్
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో పంజాబ్ రైతులే ఎక్కువ ఉన్నారు. ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే రైతుల డిమాండ్ కు కేజ్రీవాల్ పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ విషయంలో ఆయన పూర్తిగా రైతుల పక్షానే నిలిచారు. ఇది పంజాబ్‌లో ఆప్ కు కలిసివచ్చింది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాలో వైరలవుతోన్న ‘గుండు’ బాస్ కథ!
5.కాంగ్రెస్‌ను దెబ్బతీసిన అంతర్గత కుమ్ములాటలు..
2014 అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తలకిందులైంది. ముఖ్యంగా పార్టీలోని అంతర్గత కలహాలు.. దానికి పెద్ద తలనొప్పిగా మారాయి. పంజాబ్‌లో కూడా అమరీందర్, సిద్ధుల మధ్య విబేధాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయి. సిద్ధు కోసం కాంగ్రెస్ ఏకంగా సీఎంనే మార్చింది. సిద్ధు వైఖరి పార్టీకి తీరని నష్టం కలిగించింది.
6.సిద్ధు వైఖరిపై వ్యతిరేకత..
పంజాబ్ లో కాంగ్రెస్ ఓటమికి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు ఒక ఎత్తయితే.. పంజాబ్ పీసీసీ చీఫ్ నవ్‌జోత్ సింగ్ వైఖరి మరో ఎత్తు. ఆయన కోసం అధిష్టానం ఏకంగా అమరీందర్‌ను పక్కన పెట్టి.. చరణ్ జీత్ ని సీఎం చేసింది. సీనియర్‌ని కాదని.. సిద్ధూకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జనాలకు నచ్చలేదు. ఇది చాలదన్నట్లు సిద్ధూ బహిరంగంగానే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి అనుకూల వ్యాఖ్యలు చేయడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించింది అంటున్నారు విశ్లేషకులు.
7.ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌సై సానుకూలత..
పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ని ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జీత్ సింగ్‌తో పోలిస్తే.. భగవంత్ మాన్‌పై ప్రజలకు సానుకూల అభిప్రాయం ఉంది. చన్నీ సీఎం అయినా.. పాలన అంతా సిద్ధూ చేతిలోనే ఉంటుందని జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఇది కూడా ఆప్ కి కలిసివచ్చింది అంటున్నారు.
ఇవే కాక రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం, నిరుద్యోగం, ఆర్థికమాంద్యంతో తల్లడిల్లుతున్న పంజాబ్ వాసులకు ఎన్నికలో సమయంలో కేజ్రీవాల్ ఇచ్చిన హామీ ఢిల్లీ మోడల్ అభివృద్ధి ఆకట్టుకుంది. అందుకే జాతీయ పార్టీలను కాదని మరి పంజాబ్ వాసులు ఆప్ కు పట్టం కట్టారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.