తిరుమల- ప్రపంచ ప్రఖ్యాత శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దేవాలయం పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతి రోజు వచ్చే భక్తుల సౌకర్యం కోసం సరికొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది టీటీడి. అందులో ప్రధానంగా భక్తుల కోసం సంప్రదాయ భోజనాన్ని అందుబాటులోకి తెస్తోంది. అన్న ప్రసాద కేంద్రంలో ఈ సంప్రదాయ భోజనాన్ని వడ్డిస్తారు.
ఐతే ఇందు కోసం నామమాత్రపు రుసుమును వసూలు చేస్తారు. పూర్తిగా తిరుమల పరిసరాల్లో ఆర్గానిక్ పద్దతిలో పండించిన ఉత్పత్తులతో ఈ సంప్రదాయ భోజనాన్ని తయారుచేయనున్నారు. ఈ భోజనానికి ఎంత మేర ధర ఉంటుందన్నది మాత్రం ఇంకా టీటీడి వెల్లడించలేదు. ఇక తిరుమల కొండపై వసతి గదుల్లో వేడి నీళ్ల సౌకర్యాన్ని కల్పించేందుకు చేసేందుకు టీటీడి ఏర్పాట్లు చేస్తోంది.
ముందుగా గెస్ట్ హౌస్ గదుల్లో గీజర్‌లను ఏర్పాటు చేసి డిసెంబరు కల్లా అందుబాటులోకి తీసుకు వస్తామని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. అంతే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం అగర్ బత్తీలను తయారు చేయాలని నిర్ణయించింది. టీటీడీ ఆలయాల్లో వినియోగించే పుష్పాలతో పరిమళభరితమైన అగరబత్తీలను తయారు చేస్తామని ఈవో చెప్పారు. ఈ అగర్బత్తీలను సెప్టెంబరు మొదటి వారంలో తిరుమలలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుతం మరమ్మత్తులు చేస్తున్న అలిపిరి నడకమార్గాన్ని సెప్టెంబరు చివరికల్లా పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు టీటీడి ప్రయత్నిస్తోంది. ఇక తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.