కృషీ.. పట్టుదల ఉంటే ఏదైనా సాధిస్తారని, సంకల్పం గట్టిదైతే.. అంగవైకల్యం ఏమాత్రం అడ్డు రాదని ఎంతోమంది నిరూపించారు.
ఈ మద్య కాలంలో 50 ఏళ్లు దాటితే ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.. దీంతో చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు ఇతర బరువైన పనులు చేయలేని పరిస్థితికి చేరుకుంటున్నారు. ఇక 60 ఏళ్లు వస్తే ఇంటికే పరిమితం అయి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కొంతమంది పెద్దవయసులో కూడా సమాజ సేవ చేయాలని భావిస్తూ ముందుకు సాగుతుంటారు. 60 ఏళ్లు దాటిన ఓ వ్యవసాయ కూలీ దేశ శాంతి, హిందూ-ముస్లింలు ఐక్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పాదయాత్ర చేయాలని గొప్ప నిర్ణయించుకున్నాడు. అప్పటికే ఆయన కాలు విరిగి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన సంకల్పం ముందు విధి తలవంచింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాకండ్ కి చెందిన మంజునాథ్.. వయసు 60 ఏళ్లు. వ్యవసాయ కూలీగా పనిచేసిన మంజునాథ్ గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న మతకలహాలు, గొడవలు చూసి చలించిపోయాడు. దేశ శాంతి, సౌభాగ్యం అన్ని వర్గాల ప్రజలు కలిసి ఉండాలని కాంక్షిస్తూ.. తిరుపతికి చేరుకొని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే తిరుమలకు పాదయాత్ర చేపట్టాలని అనుకున్నాడు. కానీ కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో మంజునాథ్ కాలు విరిగిపోయింది. అయినప్పటికీ ఆయన చేపట్టిన పాదయాత్ర ఎలాగైనా కొనసాగించాలని భావించాడు.. ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.
2021 డిసెంబర్ లో ఉత్తరాఖండ్ నుంచి వీల్ చైర్ పై యాత్రను ప్రారంభించాడు. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ కి చేరుకున్నాడు మంజునాథ్. బుధవారం అన్నమయ్య జిల్లాలోకి అడుగు పెట్టారు. ఈ సందర్బంగా మంజునాథ్ మాట్లాడుతూ.. ‘నేను ఈ వయసలో వీల్ చైన్ పై సాహసయాత్ర చేస్తున్నానంటే.. నా భారత దేశం కోసమే.. దేశంలో శాంతి, సౌభాగ్యంతో నిండాలని… అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరుతూ ‘హిందుత్వ సనాతన్’ పేరుతో యాత్ర చేపట్టాను.. ఇప్పటి వరకు నేను రెండు వీల్ చైర్స్ మార్చాను. నా సంకల్పం తెలిసి ఎంతోమంది అభినందిస్తున్నారు.. యాత్ర పొడుగునా సహకారం అందిస్తున్నారు. త్వరలో తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శంచుకుంటానని’అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కొన్నిరోజులుగా ప్రతికూల వాతావరణాన్ని సైతం లెక్కచేయకుండా 20 నెలలుగా యాత్ర కొనసాగిస్తున్నారు.