ఈ మధ్యకాలంలో యువత ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. మంచి, చెడు విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. జైలు శిక్షలు కఠినంగా అమలు పరుస్తున్నా కూడా మారండం లేదు.
ఈ మధ్యకాలంలో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడి అవసరాలను తీర్చుకునే క్రమంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఏ మార్గంలోనైనా సరే మనీ సంపాదించాలని చూస్తున్నారు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. సాధారణంగా చిల్లర దొంగతనాలు, జేబు దొంగతనాలు జరిగితే పోలీసుల వరకు విషయం వెళితే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి.. జరిమానాలు వేసి వదిలేస్తారు. కానీ పెద్ద పెద్ద నేరాలు.. స్మగ్లింగ్ కేసుల్లో ఉన్న వారిని కచ్చితంగా జైలుకు పంపిస్తారు. నిజానిజాలు తెలుసుకుని తగిన శిక్షలు అమలు చేస్తుంటారు. అయితే ఈ నేరాలు చేసేవారిలో ఆడవారైనా సరే వారికి కూడా శిక్ష పడుతుంది. శిక్ష అనుభవిస్తూ ఖైదీలు జైలు గోడలు దూకి పారిపోవడం అపుడపుడు మనం వింటుంటాం. కానీ తాజాగా ఓ యువతి కూడా జైలు గోడ దూకి పారిపోయి పోలీసులకు చుక్కలు చూపిస్తుంది. మరి ఆమె చేసిన నేరం ఏంటి? ఈ సంఘటన ఎక్కడ జరిగిందో.. పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఉత్తరాఖండ్‌లోని పిథోర్‌గఢ్ జిల్లా జైలులో ఎన్‌డీపీఎస్ యాక్ట్ సంబంధిత ఆరోపణలతో నేపాలీ మహిళ బందీ అయింది. ఆమె జైలు శిక్ష అనుభవిస్తున్న క్రమంలో తన దుస్తులను తాడుగా తయారుచేసుకుని.. దాని సహాయంతో జైలు గోడ దూకి పారిపోయిందని పోలీసులు తెలిపారు. ఆమె కోసం 12 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. యువతి నేపాల్ పారిపోయే అవకాశం ఉన్నందున నేపాల్ బార్డర్స్‌లో చెకింగ్ కట్టుదిట్టం చేశాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌లోని దుమలింగ్ గ్రామానికి చెందిన అనుష్క ఉరఫ్ ఆకృతి అనే 25 ఏళ్ల యువతి జైలు శిక్ష అనుభవిస్తుంది. రెండున్నరేళ్ల క్రితం ధార్చులాలో రెండున్నర కిలోల చరస్ అనగా మారకద్రవ్యం తరలిస్తుండగా SSB పట్టుకుంది. కేసు విచారణ జరుగుతుండడంతో ఆమెను పిథోర్‌గఢ్ జిల్లా జైలులో బందీగా ఉంచారు. యువతి తన ఒంటిమీద ఉన్న దుస్తులను తాడుగా చేసుకుని జైలు గోడ దూకి పారిపోయింది. మహిళ జైలు నుండి తప్పించుకోవడం మొత్తం పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కలకలం రేపింది. పోలీసులు ఆమె ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పరారైన మహిళ లింక్ రోడ్డు పరిధిలోని సీసీటీవీలో కనిపించింది. అక్కడి నుండి పాండే గ్రామం సమీపంలో వెళుతూ కనిపించింది. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు బృందాలు గాలిస్తున్నాయి. యువతి ఆచూకీ తెలిపిన వారికి రూ.10వేలు అందజేస్తామని కూడా ప్రకటించారు. పారిపోయిన మహిళను పట్టుకునేందుకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.